11.5 C
New York
Sunday, November 24, 2024

కలసిన మనసులు

జి.అనసూయ

2023 దీపావళి కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ

కేశవ రావు , నాగమణిలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసి ,రిటైర్‌ అయి విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఉద్యోగం రీత్యా ఎక్కడెక్కడో పనిచేసి రిటైర్మెంట్‌ తర్వాత సిటీ చివర్లో ఓ ఇల్లు కట్టుకున్నారు. పిల్లలు ఇద్దరికీ పెళ్లెపోయి ,అమెరికాలో ఒకరు, జర్మనీలో మరొకరు ఉన్నారు. కూతురి కోసం కొన్నాళ్లు, కొడుకు కోసం కొన్నాళ్లు విదేశాల్లో ఉండి బాధ్యతలన్నీ తీరాక, ఇక తమ కలల గూడులో సేద తీరుదామని నిర్ణయించుకుని రెండు మూడేళ్లుగా ఇంటి పట్టునే ఉంటున్నారు. మరి ఒంటరితనం అనిపించకుండా పైనున్న రెండు గదులను ఎవరికైనా అద్దెకిద్దామని అనుకున్నంత లో. ఓ యువకుడు ఇల్లు కావాలని వచ్చాడు. ఒక్కడే ఉంటానని అప్పుడప్పుడు తన తల్లిదండ్రులు వచ్చి ఐదారు రోజులు ఉండి వెళ్తారని. తన నుండి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పడంతో అతని హావభావాలు, వినయం నచ్చి ఇల్లు
ఇచ్చారు. అతని పేరు రామ్‌. నిజంగా పేరుకు తగ్గట్టే బుద్ధిమంతుడు. చేస్తున్నది పెద్ద కంపెనీలో ఉద్యోగం. ఆర్‌ అంకెల్లో జీతం అయినా ఎంతో వినయంగా ఎలాంటి దురలవాట్లు లేని మంచివాడు. ఈ కాలంలో ఇంత మంచి ఒకలు ఉంటారా అనుకునే వాళ్ళు కేశవరావు జంట. ముప్పై ఏళ్లు దాటుతున్నా పెళ్లెందుకు చేసుకోలేదు అనుకునే వాళ్ళు.

రామ్‌ చెప్పినట్లే వాళ్ల అమ్మానాన్న వచ్చారు. ఒకట్రెండు సార్లు. రామ్‌ వాళ్ళ నాన్న వెంకటకృష్ణ టీచర్‌ గా పనిచేసి రిటైరయ్యాడట. వాళ్ళ అమ్మ రాధ భర్త తగ్గ ఇల్లాలు. వాళ్ళను చూస్తేనే రాం కి సంస్కారం ఎలా అబ్బిందొ తెలుస్తోంది.

కేశవరావు ఉన్నత భావాలు గల వ్యక్తి. ఎన్నో సంఘాలలో పనిచేసిన అనుభవం ఉంది. ఉదయాన్నే ఇద్దరూ ఇంటి ముందు ఉన్న చెట్ల మధ్యలో కూర్చొని. ఇంగ్లీష్‌ తెలుగు పేపర్లు క్షుణ్ణంగా చదువుతారు. కాసేపు వాకింగ్‌ కు వెళ్లినస్తారు. ఇంటి పని వంట పని అన్ని కలిసే చేస్తారు. మధ్యానం, టీవీతో కాలక్షేపం. సాయంత్రం టేప్‌ రికార్డుల్లో పాటలు వింటూ టీ తాగుతూ కనిపిస్తారు. రామ్‌ పొద్దున్న వెళితే సాయంత్రం 6:00 గంతలకు ఇల్లు చేరుతాడు. కేశవ రావు నాగమణిలు కనబడితే విష్‌ చేసి పలకరిస్తాడు. అప్పుడప్పుడు వీళ్లతో కూర్చొని మాట్లాడుతుంటాడు.

ఈ సారి వీళ్ళ అమ్మానాన్నలు వచ్చినప్పుడు అడగాలి. పెళ్లి సంబంధాలు ఏవైనా చూస్తున్నారా అని, అన్నది నాగమణి భర్తతో.

అవునవును మన వాళ్లలో ఎవరైనా మంచి అమ్మాయి ఉంటె చెపుదామ్‌ కూడా అన్నాడు కేశవరావు. ఆ వారమ్‌ లొనే దూరపు బంధువులను ఎవరినో కలవడానికి వచ్చారు వెంకటకృష్ణ, రాధ ,అలాగే కొదుకు దగ్గర ఓ రెండు రోజులు ఉండి వెళ్దామని. పనంతా తీరాక ఇద్దరు కేశవరవు గారింటికి వచ్చారు. పలకరింపులయ్యాక నాగమణి చొరవ తీసుకొని ఏమండీ అన్నయ్య గారూ. రామ్‌ ని ఎన్ని రొజులు ఒంటరిగా ఉంచుతారు. పెళ్లి చేస్తే ఇద్దరూ ఒకరికొకరు తోడు ఉంటారు కదా అన్నది నాగమణి.

అవునమ్మా, మేమూ చెబుతూనే ఉన్నాం. కానీ మా వాడు పెళ్లి మాటే ఎత్తనీయటం లేదు అన్నడు వెంకట కృష్ణ. ఈయన మాట ఏవీ చెల్లుబాటు అయ్యేటట్టు లేదు. రాద ని అడగాలి. అన్ని రకాలుగా మంచి సంబంధం. మనవాళ్లు ఎవరికైనా చెబితే బంగారంలాగా చేసుకుంటారు అనుకున్నది. మగ వాళ్ళు ఇద్దరు బయటకు వెళ్లడం చూసి రాధతో మాటలు కలిపింది.

రాధ గారు మీరేం అనుకోనంటే ఓ మాట అడుగుతాను. రామ్‌ని సంవత్సర కాలంగా చూస్తున్నాను. బుద్ధిమంతుడు, ఉద్యోగస్తుడు. పెళ్లి సంబంధాలు చూస్తున్నారా, అనడిగింది.

అయ్యో అనుకోవడానికేముందండి. నాకూ ఆ దిగులే ఉంది. ఎన్నో సంబంధాలు వదులుకొని నాలుగేళ్ల కిందట వాడికి నచ్చిన అమ్మాయినే పెళ్లి చేశాం. కానీ నెల రోజులైనా కాపురం చేయక ముందే కాదు కూడదు అనుకుని ఇద్దరూ విడిపోయారు . ఎవరు ఏం చెప్పినా వినలేదు. అమ్మాయి బాగా చదువుకుంది. వీడితో పాటు సంపాదిస్తుంది. ఇద్దరు హాయిగా బతుకుతారనుకున్నాం. కానీ ఇలా మూన్నాళ్ల ముచ్చట అవుతుందనుకోలేదు. పోనీ అయిందేదో అయింది. మళ్లీ పెళ్లిచేసుకో అంటే వీడేం మాట్లాడడు అంది రాధ. కళ్లనీళ్లు తుడుచుకుంటూ.

ఇలాంటివన్నీ ఈ రోజుల్లో మామూలైపోయాయి రాధ గారు. మీరేం బాధపడకండి. వాళ్ళ మనసుకు నచ్చిన వాళ్ళు దొరికినప్పుడు వాళ్లే చేసుకుంటారు. ఈ విషయాలు తెలియక మీ మనసు నొప్పించాను క్షమించండి అన్నది నాగమణి.

అంతమాట అనకండి. ఇందులో క్షమాపణలు ఎందుకు. మీరైనా వాడి మనసులో ఏముందో తెలుసుకుని పెళ్లికి ఒప్పిస్తే మీకెప్పటికీ రుణపడి ఉంటా అన్నది రాధా. అయ్యో అంత మాట అనకండి. సావకాశంగా మాట్లాడి. కనుక్కుంటానండి. బంగారం లాంటి అబ్బాయి. తొందరపాటులో ఎన్నో జరుగుతుంటాయి. అన్నిటిని దిద్దుకుంటూ ముందుకుపోవాలి గానీ జరిగింది తలుచుకుంటూ కూర్చుంటే ఎలా సాగుతుంది అన్నది నాగమణి ఓదార్పుగా.

నాలుగు రోజులయ్యాక , ఓరోజు తీరుబడిగా భర్తతో ఈ విషయమంతా చెప్పింది. ఇద్దరు కలిసి రామ్‌ తో ఈ విషయాలు మాట్లాడాలనుకున్నారు. అనుకున్నట్టే ఆదివారం నాడు భోజనానికి పిలిచి. భోజనము మాట మంతి అయ్యాక. రామ్‌ తో ఈ విషయం కదిపారు. మీ అమ్మగారు నీ పెళ్లి విషయం చెప్పారు. అసలు ఏం జరిగింది రామ్‌. నీ అంత మంచివాడిని వదులుకున్న అమ్మాయి పిచ్చిదైన కావాలి. లేకపోతే పొగరుమోతైన అయి ఉండాలి. జరిగిందేమిటో తెలిస్తే భవిష్యత్తులో ఏం చేయాలో ఆలోచిద్దాం. నీకు అభ్యంతరం లేకుంటే ఉన్నది ఉన్నట్టు చెప్పు. నీకు మాట్లాడడం ఇష్టం లేకపోతే ఈ విషయాన్ని శాశ్వతంగా వదిలేద్దాం అన్నారు. కేశవరావు.

కొంత బాధ, కొంత మొహమాటంగా
అదేమి లేదంకుల్‌. పెద్దవాళ్ళు మా అమ్మా నాన్నల తర్వాత నా గురించి ఇంతగా ఆలోచిస్తున్న వాళ్ళు మీరే అంటూ చెప్పుకొచ్చాడు రామ్‌.

మాట్రిమోని లో చూసాం,చందన సంబంధం. అమ్మాయి బాగుంది, తెలివైంది, క్యాంపస్‌ సెలక్షన్స్‌లోనే ఎంఎన్‌సీ లో జాబ్‌ సంపాదించింది. ఓ మోస్తరు మధ్య తరగతి కుటుంబం, ఇద్దరు ఆడపిల్లలు. అన్ని బాగున్నయనిపించింది. పెళ్లికి ముందు ఫోన్‌లో మాట్లాడటం తప్ప ఎక్కువ కలిసింది లేదు. ఫోన్‌ లో చాలా బాగా మాట్లాడేది. తీరా పెళ్లయ్యాక తెలిసింది. తనకసలు అప్పుడు పెళ్లి ఇష్టం లేదని. భర్త పిల్లలు ఇంటి బాధ్యతలు ఇవేవీ లేకుండా హాయిగా సంపాదిస్తూ ఖర్చు పెట్టుకుంటూ. దేశ విదేశాలు తిరుగుతూ ఉండాలని.

మా అమ్మా నాన్న తనకు అనాగరికులలా చాదస్తంగా కనిపించారట. నా ఉద్యోగం జీతం. తనకు గొప్పగా
అనిపించలేదు. ఇంతోటి ఉద్యోగానికి మీ వాళ్ళు కట్నం అడిగారు, అని దెప్పిపొడిచేది. మా అమ్మా వాళ్ళతో ఉన్న నెల రోజుల్లో వాళ్ళను అలక్ష్యం చేయడం. తిన్న పళ్లెము కూడా తీయకుండా వెళ్లడం. ఇష్టం వచ్చినట్టు ఎదురు మాట్లాడడం. నేను భరించలేకపోయాను. మంచిగా చెప్పాలని చూశాను. కానీ తను చాలా అహంకారంగా మాట్లాడి నేనిలాగే ఉంటాను. ఇష్టం లేకపోతే ఎవరి దారిన వాళ్ళు పోదాం అంటూ మాట్లాడేసరికి నేను భరించలేకపోయాను. చిలికి చిలికి గాలివాన అయినట్టు. చివరకు విడాకుల వరకు వెళ్లింది. ఇందులో నా తప్పేంటో నాకు ఇన్హ్త వరకు అర్థం కాలేదు. మళ్లీ పెళ్లి అంటేనే భయంగా ఉంది, అన్నాడు రామ్‌.

ఇవ్వాళా రేపు పిల్లలు అలాగే ఉన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు. మితి మీరిన స్వేచ్చ. చిన్న వయసులోనే పెద్ద ఉద్యోగాలు. సంపాదన ముందు. మిగతా జీవితం అంతా చిన్నగానే కనిపిస్తుంది. పెళ్లంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం. అనుభూతులు పంచుకోవడం. అనేది మర్చిపోయి నేను నాది అనేవి ముఖ్యం అనుకుంటున్నారు. నీ విషయంలో జరిగింది. చిన్న విషయమేమీ కాదు. కానీ ఎంతటి విషాదానికైనా ఓ ముగింపు ఉంటుంది రామ్‌, అందరు అమ్మాయిలు అలానే ఉంటారని అనుకోకు. నీకు తగిన అమ్మాయి తప్పకుండా నీకు దొరుకుతుంది. రాములో ధైర్యం నూరిపోయడానికి ప్రయత్నించారు. కేశవరావు, నాగమణి గార్లు.

రామ్‌ విషయాలు తెలిశాక మరింత సన్నిహితమయ్యారు. నాగమణి, కేశవరావులు రామ్‌ ని సొంత కొడుకులా
చూసుకుంటున్నారు. తమకు తెలిసిన అమ్మాయిల గురించి వాకబు చేస్తున్నారు. ఓరోజు సాయంత్రం వరండాలో కూర్చొని టీ తాగుతూ కేశవరావు అన్నాడు.

నాగమణి వెనకటికెవరో చంకలో పిల్లను ఎత్తుకుని ఊరంతా వెతికిందట, అట్లనే ఉంది సంగతి అన్నాడు.
భర్త పరాచికానికి ఏదైన అన్నా, దాంట్లో విలువైన సమాచారం ఏదో ఉంటుందని.

ఏ విషయంలో ఈ సామెత చెప్పారు శ్రీవారు. నా మొద్దు బుర్రకు అర్ధం కాలేదు, కొంచెం విడమర్చి చెప్పండి అన్నది నాగమణి.

అదేనోయ్‌ మీ తమ్ముడి కూతురు సిరి ఆ మధ్య అంటూ గుర్తు చేశాడు.

అవునండి ఇప్పుడు మీరు అంటే గుర్తొచ్చింది, పాపం అది ఎంత మంచి పిల్ల ఎంతో తెలివైంది ఏంటో? దాని లైఫ్‌ అట్ల అయిపోయింది. ఇప్పుడైనా ఎవరైనా మంచి పిల్లవాడు దొరికితే బాగుండేది. ఓసారి తమ్ముడితో మాట్లాడతాను. అసలిదంతా మనం ఆ సమయంలో ఇండియాలో లేకపోవడం వల్ల జరిగింది. అంటూ బాధపడ సాగింది నాగవేణి.

నిజమే మంచి సంబంధం అన్నీ కుదిరాక ఆలస్యం చేయడం ఎందుకని మీ తమ్ముడు హడావిడిగా పెళ్లి చేయడం. పెళ్లై నెలరోజులు కాకుండానే విడాకుల దాకా రావడం. పాపం మీ తమ్ముడి బాధ చూస్తే. చాలా బాధ అనిపించింది. సిరిలాంటి అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రావడం. నాకు ఆశ్చర్యంగానే ఉంది. సరే సరే నీ తమ్ముడితో మాట్లాడు. మళ్ళీ సంబంధాలు ఏవైనా చూస్తున్నారేమో. మన రామ్‌ లేదూ అబ్బాయిది ఇదే పరిస్థితి కదా. అంతా బాగుంటే సిరికి రామ్‌ ను ప్రపోజ్‌ చేస్తే బాగుంటుందేమో అన్నాడు కేశవరావు. అవునండి…నాకు ఆ ఐడియా నే రాలేదు. ఇద్దరు మంచి పిల్లలే. రామ్‌ ను చూస్తే ఎవరో పరాయివాడు అనిపించదు. అలాగే సిరి కూడా మన కళ్ల ముందు పెరిగిన పిల్ల. దాని బతుకు ఇలా ప్రశ్నార్థకంగా మిగిలిపోవడం. నాకు బాధగానే ఉంది. మీరు అన్నట్టు ఇద్దరికీ జత కుదిరితే అంతకన్నా సంతోషం
ఏముంటుంది? అనుకున్నట్లే తమ్ముడు శ్రీనివాసుకు ఫోన్‌ చేసింది. మాములు పలకరింపులయ్యాక. సిరి ఎలా ఉందిరా? ఏముంటుంది? సంబంధాలేమైన చూస్తున్నారా? అని అడిగింది.

అది గట్టిగా ఏ విషయం చెప్పడం లేదు అక్క. ఏమన్నా అడిగితే కళ్లనీళ్లు పెట్టుకుంటుంది. నీ మరదలు రోజు ఈ ప్రస్తావన తీసుకొస్తుంది,ఈ దిగులుతో ఆరోగ్యం పాడు చేసుకుంటుంది.

సిరి ఏమో? చూద్దాం లేమ్మా. ఇప్పుడు తొందరేముంది అంటుంది.

అలాగంటే ఎలా రా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి గానీ. దానికి కాస్త నిదానంగా నచ్చజెప్పండి. అది ఒప్పుకుంటే మనకి తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు మాట్లాడదాం అన్నది.

సరే అక్కయ్య, ఆదివారం సిరితో మాట్లాడతా. తన నిర్ణయం చెప్పగానే, చెబుతా అన్నాడు తమ్ముడు శ్రీనివాస్‌. ఆదివారం సెలవు కావడాన ఇంట్లోనే ఉంది సిరి. పొద్దున్నే లేచి తల్లికి ఇంటి పనుల్లో సాయం చేసి, ఇల్లు సర్ది స్నానం చేసి, ప్రెష్‌ గా డ్రెస్సప్పై,లాప్‌టాప్‌ మీద పనిచేసుకుంటున్న కూతుర్ని చూస్తూ, ఇలాంటి పిల్ల నా, పనిచేయదు, పొగరుబోతు అంటూ దూరం చేసుకున్న దుర్మార్గుడు అనుకున్నాడు.

తండ్రి వచ్చిన అలికిడికి చేస్తున్న పని ఆపి. రండి నాన్న కూర్చోండి అన్నది సిరి.

అమ్మా సిరీ ,అంటూ చెప్పబోయాడు.

ఏంటి నాన్న, ఏమైనా అడగాలనుకుంటున్నారా? అన్నది.

జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా నివు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండి ఉంటే. చూడాలని ఉంది అమ్మా. మీ అమ్మని చూస్తున్నావు కదా,ఆరోగ్యం కూడా బాగాలేదు గురించిన దిగులుతో. రొజు రొజుకు కుంగి పోతుంది.

సారి నాన్న మీ అందర్నీ ఇన్తగా బాధపెట్టినందుకు. నేను తొందరపడ్డాను కానీ ఇంత దాకా వస్తుందని నేను
ఊహించలేదు.

పోనీయమ్మ కాలాన్ని వెనక్కి తీసుకురాలేం. ముందు జరగాల్సిన వాటి గురించి ఆలోచించాలి. నీవు ఊ అంటే సంబంధాలు చూస్తాం. నాగవేణి అత్త ఫోన్‌ చేసి నీ మనసులో ఏం ఉందో అడిగి చెప్పమన్నది. అన్నాడు తండ్రి.

నిజమే నన్నా? ఆ టైమ్‌ లో అత్త ఉంటే. ఈ విషయం ఇంతదూరం వచ్చేదికాదు. సిరి కళ్లలో నీళ్లు.
నీవే దిగులుపడకు తల్లి. మనసులు కలవని కాపురాల కంటే . ఎవరికి వాళ్లు బతకడమే కరెక్ట్‌. అన్నాడు శ్రీనివాస్‌.

సరే నాన్నా మీరు ఏది కరెక్ట్‌ అనుకుంటే అదే చేయండి , అన్నది సిరి.

అదే విషయాన్ని అక్కతో చెప్పాడు శ్రీనివాస్‌. మంచి అబ్బాయి ఐతే మాట్లాడక్కా, సిరి పెళ్లి టైమ్‌ లో నీవు
ఉంటే,ఇదంతా జరిగేది కాదు. హ్సిరి కి కూడా నీనంటే , ఎంతో నమ్మకం. అన్నాడు శ్రీనివాస్‌.

పోని లేరా? జరిగిందాన్నిమర్చిపోయి. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే.
అబ్బాయితో ఓసారి మాట్లాడి. అన్ని విషయాలు చెబుతాను. సిరితో మాట్లాడి నిర్ణయం తీసుకుందాము .

రామ్‌ తో సిరి గురించి చెబుతూ,నా మేనకోడలు అని కాదు గాని సిరి నిజంగా చాలా మంచి పిల్ల ,దాన్ని
వదులుకున్నవాడు నిజంగా మూర్చ్కుడే అయి ఉండాలి. అది గలగల పారే సెలయేరులాంటిది. అదే ఎక్కడ ఉంటే అక్కడ జీవం ఉట్టిపడుతూ ఉంటుంది. దానితో జీవితం పంచుకునేందుకు పెట్టిపుట్టాలి. అదృష్టవంతుడిని నీవు ఎందుకు కాకూడదు. నువ్వు సరేనంటే నేను సిరిచందన తో మాట్లాడతాను. మీ ఇద్దరి జంట చక్కగా ఉంటుందని నేను మీ అంకుల్‌ అనుకుంటున్నాం అన్నది నాగమణి.

మీరింతగా చెబుతున్నారు కాబట్టి. సరే ఆంటీ. ఇంతకు ముందు చందన విషయం లో కూడా ఇలాగే చెప్పారు అందరూ. ఆమె మంచిదానిలాగే కనిపించింది. నిజానికి చెన్న అనడానికి కూడా ఏమీ లేదు. కానీ అదేదో. తన స్వేచ్చను హరించేసినట్లు. అసలు పెళ్లి అంటేనే ఇష్టం లేనట్టు… గొంతులోదుఖం అడ్డుపడింది పడింది రామ్‌కు.

ఇద్దరికి చిన్నతనం కదా రామ్‌. పెళ్లి అంటే తను ఏదో ఊహించుకొని ఉంటుంది. మబ్బుల్లో నీళ్లు చూసి, ముంత వలకపోసుకున్నట్లు, నీ లాంటి వాడిని వదులుకొని. తను మాత్రం ఏం సుఖపడుతుందిలే. అన్నది నాగమణి.

ఓ ఆదివారం ఇద్దర్ని ఫోన్‌ లోనే ఇంట్రడ్యూస్‌ చేసింది. ఒకరి గురించి ఒకరు చెప్పుకున్నారు. చాటింగ్‌లో అభిరుచులు, అభిప్రాయాలు పంచుకున్నారు. ఇద్దర్ని కలిపి పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దాం అనుకునే లోగా దేశవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్‌ మొదలైంది. కరోనా ఆంక్షలతో ఆరు నెలలు గడిచిపోయాయి. సిరి, రామ్‌ ఫోన్‌ కాల్స్‌ ఆన్‌ లైన్‌ చాటింగ్‌ లతో మరింత దగ్గరయ్యారు. ఒకరి గతం మరొకరు ప్రశ్నించకుండా, ఒకరినొకరు నొప్పించుకోకుండా, జాగ్రత్తగా మాట్లాడుకునే వాళ్ళు. నిజంగానే ఎవరికి తగినవాడని వాళ్లకు ప్రకృతి నిర్ణయిస్తుందా? దానికి విరుద్ధంగా చేసినందుకే. తమ పెళ్లి విఫలమైందా? అనుకున్నారు. ఎవరికి వాళ్లు?

కరోనా తగ్గుముఖం పట్టాక ఇద్దరూ కలుసుకోవాలనుకున్నారు. ఇంట్లో కాకుండా ఏదైనా హోటల్‌ లో కూర్చొని మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఇంటికి వస్తాన న్నది సిరి.అనుకున్న సమయానికి అరగంట ముందే బుక్‌ చేసిన టేబుల్‌ దగ్గర కూర్చున్న రామ్‌. దూరం నుండి నీలిరంగు చీరలో తెల్ల గులాబీల నడిచోస్తున్న అమ్మాయిని చూసి. గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. జుట్టును వెనక్కి తీసుకుంటూ. టేబుల్‌ నెంబర్‌ పరిశీలిస్తూ వస్తున్న అమ్మాయి తన టేబుల్‌ దగ్గరాగడం, మీరు రామ్‌ కదూ అంటూ సందిగ్ధంగా ఆశ్చర్యంగా అడగడం.

అవును నేను రామ్‌, మీరు సిరి …ఎక్కడో చూసినట్టుంది ఈ అమ్మాయిని అనుకుంటూ. రండి కూర్చోండి అంటూ తన ముందు సీటు చూపించాడు రామ్‌.

అప్పటిదాకా కళ్లకున్న అద్దాలు తీసి కర్చీఫ్‌తో కళ్ళు తుడుచుకుంటూ. అతనే పరిశీలనగా చూసింది సిరి. అప్పుడు గుర్తొచ్చింది రామ్ కు. వెతుకుతున్నదేదో దొరికినట్టు. ఎప్పుడో పోగొట్టుకున్న విలువైన వస్తువేదో చేతికి అందినట్టు. మీరు…. నీవు చందన… అన్నాడు రామ్‌. అప్పుడే అతడి మోహన్ని దగ్గరగా చూసి గుర్తుపట్టినట్టు మీరు అభి-..అన్నది .అప్రయత్నంగా చేయి చాచిన అభిరామ్‌ చేతిని అందుకుంది సిరిచందన. చిరపరిచితమైన చేతి స్పర్శ ఇద్దరినీ వివశులను చేసింది.

ఐ ఆమ్‌ సారీ. నేను అప్పుడు తొందర పడ్డాను అన్నదామె.అయామ్‌ ఎక్సీమ్‌ లీసారీ. నేను నేను అర్ధం చేసుకోలేకపోయాను.

ఏం ఆర్డర్‌ చేశారో. ఏం తిన్నారో తెలియదు. ఇద్దరు కలిసి ఇంటికి వచ్చారు.

చాలా కాలం తర్వాత, అనుకోకుండా వచ్చిన. మేనకోడలిని చూసి ఆశ్చర్యపోయింది నాగమణి. మీరిద్దరూ ఎక్కడ కలిశార్రా? అంటూ రామ్‌ వైపు చూసింది. రామ్‌ ఏం మాట్లాడకుండా సిరి వైపు చూశాడు,ఏం చెప్పాలి అన్నట్టు.

నాగమణి, సిరి లోపలి గదిలోకి వెళ్లారు. రామ్‌ హల్లొ కేశవరావు ఎదురుగా. సోఫాలో కూర్చున్నాడు.

నాగమణితో జరిగిందంతా చెప్పి అత్తయ్య. నీవు పరిచయం చేసిన రామ్‌. అభిరామ్‌ అని నాకు తెలీదు. నేను సిర్‌ చందన అని తనకు తెలియదు. ఎలాగైతేనేం? కాదనుకుని విడిపోయిన మమ్మల్ని మళ్ళీ ఒక్కటి చేసిన పుణ్యం నీదే. అంటూ అత్త కాళ్లకు వంగి దండం పెట్టింది సిరి.

కేశవ రావు నాగమణి పెళ్లి పెద్దలుగా రెండు కుటుంబాలను పిలిచి రిజిస్టర్‌ ఆఫీస్‌లో మరోసారి ఇద్దరినీ కలిపారు. మబ్బులు వీడిన ఆకాశంలా నిర్మలమైన మనసులతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Vote this article
Prakasika
Author: Prakasika

Related Articles

Stay Connected

Latest Articles