ఇంకుడుగుంత
ప్రకాశిక నిర్వహించిన 2020 దీపావళి కథల
పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ.
నా జన్మభూమి ఎంత అందమైన దేశము…
నా ఇల్లు అందులోన చల్లనీ ప్రదేశము…
నా సామీరంగా..హై..హై..నా సామీరంగా
ఒకప్పటి చిత్రంలో నాగేశ్వర్రావుగారిలో ఎంత ఆనందమో, నాలో అంతకు రెట్టింపు ఆనందం. ఒక్కటే తేడా- ఆయన చిత్రంలో పాట
కోసం నటించి ఉండవచ్చు. కానీ నేను అనుభవిస్తున్నాను.
పది సంవత్సరాల క్రితం వైట్ కాలర్ జాబ్ రెక్క పట్టుకొని పరాయి దేశంలో అతిథినై ఎగిరి వెళ్ళాను నేను. ఇంతకాలం తర్వాత- పుట్టిన ఊరిపై మమకారంతో ముఖ్యంగా తాతయ్య అనురాగంతో మనసు వాయువేగంతో ఉంటే, బస్సు మాత్రం తాబేలు నడక మల్లే ఉంది. ఐనా హాయిగా కారులో రాగలిగే స్థోమత ఉండి కూడా ఈ నెలరోజులైనా మునుపటిలా తిరగాలనే కోరిక! కిటికీ పక్కసీటులో కూర్చుని బయటకు చూస్తున్నాను. నగరం పొలిమేరలు దాటి పల్లె వైపు పరుగు తీస్తున్నది.అంతే!! కాలం అదుపు తప్పినట్టుగా- పదును ఎరుగని నేల నెర్రెలతో కనిపిస్తోంది. వర్షం
మొండికేయగా మొలకలు ఎండిపోయి చెలక చిన్నబోయింది. తడారిన పొలాలన్నీ ఎడారిలా కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాలన్నీ హృదయవిదారకంగా ఉన్నాయి. ఒకప్పుడు ఊళ్ళు ప్రకృతి ఒడిలో ఆడుకుంటున్న పసిపాపల్లా, కేరింతలు కొడుతూ ఆనందంతో హాయిగా ఉండేవి. ఎటు చూసినా పచ్చని పండ్ల తోటలు, కూరగాయ చేనులు, వరి పొలాలతో జీవకళ ఉట్టిపడేది. నేడు బక్కచిక్కి పొదుగు ఎండిన గోమాతలా, అస్థిపంజరంలా కనిపిస్తున్నాయి. అటువంటి ఆ దృశ్యాలు నన్ను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మా ఊరు, తాతయ్య పొలం ఇలాగే వట్టిపోయి బీడువడ్డాయా? ఆ మోడు బతుకుల్ని చూసి నేను తట్టుకోగలనా? ఆలోచన రాగానే- ఆనందం ఆవిరై, ఆవేదన మేఘమై, కన్నీళ్ళలా కురిసేందుకు సిద్ధమవుతోంది. ఆ జ్ఞాపకాల గతం కళ్ళ ముందుకు వచ్చింది.
తాతయ్య ప్రకృతి ప్రేమికుడు. జపనీస్ వ్యవసాయ ప్రేమికుడి స్ఫూర్తితో తనకున్న
ఇరవై ఎకరాలలో ఫుడ్ ఫారెస్ట్ నిర్మించాడు. మట్టి గోడలు గడ్డి కప్పు ఆవాసాలతో తన
దగ్గర పని చేసే కూలీలందరికీ నివాస స్థలాలు ఇచ్చాడు. చక్కగా పది, పదిహేను
కుటుంబాలు తాతయ్యను, ప్రకృతిని, వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తుండేవి.
పనస, బొప్పాయి, అరటి, సపోటా వంటి పండ్లతోటల సాగు చేస్తుండేవి. అలా తాతయ్య
అప్పటినుండే జీవితానికి మట్టిపరిమళంతో పాటు మంచితనాన్ని అద్దుకొని
గుబాళిస్తున్నాడు.
తాతయ్యది పెద్ద బంగళా. ముందు తోట. తోటలో పని చేస్తున్నంతసేపూ మొక్కలతో,
పువ్వులతో మమేకమై కనిపిస్తాడు. పనిలోనే పరమాత్ముని దర్శిస్తాడు. ఇప్పటికీ పలుగు
తీసుకొని పాదులు చేస్తుంటాడు. తాతయ్య ఇప్పుడు రారాజు కానీ- తన తాతలనాడు
దొడ్డు బియ్యం ఉడకేసుకొని ఏ ఉల్లిపాయో, మిరపకాయో ఉప్పుతో నంజుకొని పంచభక్ష్య
పరమాన్నం తిన్నంత తృప్తిగా నిద్రపోయేవాడట. అదే ఆయన ఆరోగ్య రహస్యం. చేసే
పనిని ప్రేమిస్తే వచ్చే ఫలితం ఎట్లాంటిదో రుజువు తాతయ్యే. ఆ ఇంట్లో ఏసీ అవసరం
ఉండదు. పచ్చని ప్రకృతి గాలి ఊయల ఊపుతూ జోల పాడుతుంది. వైభోగమంతా
ఇప్పటికీ అలానే ఉండి ఉంటుందా…ఏమో? నేను చూస్తున్న దృశ్యాలు నా ఊరినీ
కబళించి మృగ్యం చేశాయా… అనుకుంటే చాలా బాధగా ఉంది.
ఇది చూడటానికా నా ఊరికి వెళ్తున్నాను. హే భగవాన్! నేను రాకున్నా నా చిన్నప్పటి
మధుర చిత్రాలు మలిగిపోకుండా ఉండేవేమో? ఇప్పుడున్న స్థితిలో నా ఊరిని చూసి
తట్టుకునే మనోధైర్యాన్ని నాకివ్వు ప్రభూ…అనుకోగానే కన్నీళ్ళు రాలాయి. అలా అలా
ఆలోచనలతోనే ఊరు చేరాను.
ఇంటికి నడిచి వెళ్తుంటే చాలావరకు సగం కూలిన ఇళ్ళే! వదిలివేసి ఉన్నవే.
పళ్ళూడిన బోసినోటిలా ఉన్నాయి. ఇల్లు చేరిన నాకు తాతయ్య, నానమ్మ ఆత్మీయస్పర్శ
ఊరటనిచ్చింది. మరుసటి రోజు పొలం వద్దకు వెళ్ళాం. ఆశ్చర్యకర విషయం
ఏమిటంటే- ఇంత కరవు రాక్షసి తాండవిస్తున్నా, మా పొలం గట్లు పచ్చగా కళకళ
లాడటం సంతోషాన్నిచ్చింది. అది ఎలా సాధ్యమయ్యిందో తాతయ్యనే అడిగాను.
చుట్టూ ఉన్న నేలను పదేపదే వదులుచేయడం కారణమని చెప్పాడు. ఇంకా నాటిన
తొలి రెండు వారాలూ అతి తక్కువ నీటితోనే వాటిని (మొక్కలను) కాపాడుకోగలిగానని
అన్నాడు. తొలకరి తర్వాత అడుగు లోతు దుక్కి దున్ని, కొన్ని రోజుల అనంతరం
మరోసారి లోతుగా మట్టి వదులవగా… అడుగులోతు నాలుగు అంగుళాల వెడల్పుతో
గుంతలు తవ్వి నీళ్ళు పోసి మొక్కలు నాటానన్నాడు. ఆ చెమ్మ రెండు వారాలు మొక్క
బతికేందుకు ఉపయోగపడి, వేళ్ళు లోపలికంటా వెళ్ళడం కారణంగా మొక్క తనంత
తానే అతి తక్కువ నీటితో బతికేస్తుందని వివరంగా చెప్పాడు.
తనకి వ్యవసాయం మీద ఉన్న మక్కువ స్పష్టంగా అర్థమైంది. అదే ఆయనను, ఆ
మొక్కలను బతికిస్తున్నదని బాగా తెలిసివచ్చింది. మరింత ఉత్సాహంగా చెప్పాడు- తన
ఇరవై ఎకరాల తోటను కూడా వాటర్ మేనేజ్మెంట్ ఫోరం నిపుణుల సూచనల మేరకు
చేశాడట. వాలుకు అడ్డంగా ప్రతీ 50 మీటర్లకు ఒక వరుసలో కందకాలు తవ్వించానని,
అదృష్టం కొద్దీ- తవ్విన కొద్దిరోజుల్లోనే ౩ రోజులపాటు మంచి వర్షాలు కురిసాయని
అన్నాడు. పొలాల్లో కురిసిన ప్రతీ చినుకూ కందకాల ద్వారా అంతకు ముందెన్నడూ లేని
విధంగా భూమిలోకి ఇంకిందని, భూగర్భ జలమట్టం పెరిగిందని చెప్పాడు. అంతకు
ముందు ఆఫ్ ఇంచు పోసే బోర్లు ఇప్పుడు 4 ఇంచులు ఫుల్లుగా పోస్తుండడం తాతయ్య
విజయ పరంపరను చెప్పకనే చెప్తున్నాయి.
తనతో పాటు ఊరివాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటి
ఆవరణలో కూడా సంవత్సరమంతా నీరు పుష్కలంగా అందాలంటే, ఇంకుడు గుంతలే
ఏకైక మార్గమని ఆలోచించాడు. 250-500 గజాల స్థలంలో ఉన్న ఇంటి ఆవరణలో 4
అడుగుల వెడల్పు 6 అడుగుల పొడవు 8 అడుగుల లోతు ఉండేటట్లుగుంట తీశాడు.
గుంట లోపల నాలుగు వైపులా అడుగు భాగంలో ఎక్కడా సిమెంట్ ప్లాస్టరింగ్
చేయకుండా… ఇంకుడు గుంత ద్వారా తన ఇంటిని, పంటని కాపాడుకుంటున్న
తాతయ్య ఆ క్షణం అపర భగీరథుడులా కనిపించాడు. తనకున్న అనుభవం, అంతకు
మించిన ఆరాటం, ఎలాగైనా గెలవాలనే పోరాటం నాకంటే తానే యువకుడిలా
కనిపించేలా చేస్తోంది.
ఒక్కొక్క తేనెటీగ ఒక్కో తేనెబొట్టును ఒడిసిపడుతూ సేకరించి, తేనెపట్టున దాచి
బాటసారులకు పంచినట్టు… తాతయ్య ఒక్కొక్క నీటిబొట్టునూ ఒడిసిపడుతూ ముందు
తరాలకు దాచిపెడుతున్న వైనం నన్ను పరమానందభరితుణ్ణి చేసింది. ఎన్నో అనుభవాలు
ఇముడ్చుకున్నాడు. నిరాశ దరిజేరనీయక ఆత్మానందం, మూర్తీభవించిన
ఆత్మవిశ్వాసంతో ఆయనే ఒకపెద్ద ఇంకుడుగుంతలా కనిపించాడు!