ఎదుటివారిమీదకు నెట్టుకుంటూ సభలో గందరగోళం సృష్టించారంతా!
దీనికి, తాను ప్రత్యక్ష సాక్షినంటూ, టంగుటూరి ప్రకాశంగారు ‘నా జీవిత యాత్ర’
గ్రంథంలో కొన్ని విషయాలు ఉటంకించారు. ఈ సంఘటనకు ఒక నేపథ్యాన్ని ఆయన ఇలా
విశ్లేషించారు.
“నాగాపురం నుంచి వచ్చిన ప్రతినిధులు లాఠీ కర్రలతో ‘తిలక్ మహరాజుకీ జై’
అనుకొంటూ వేదిక మీదకు ఉరికారు. తరువాత గలాటా పెరిగి ఉభయ పక్షాలవాళ్ళూ
కుర్చీలూ, బెంచీలు కూడా చేత బట్టి విజృంభించారు. అనేకమందికి గాయాలు తగిలి రక్తం
స్రవించింది” అదీ సంఘటన. సరిగ్గా నేటి పరిస్థితికి నాటి పరిస్థితి నకలుగానే ఉంది.
“ఆ కాలంలో కాంగ్రెస్కి ఫిరోజిషా మెహతా నియంతవంటి వాడే! కాంగ్రెస్ సంఘాలు
అనిగానీ, ప్రతినిధుల్ని ఎన్నుకోవడం గానీ, ప్రతినిధులు ప్రెసిడెంటును ఎన్నుకోవటం గాని
ఏమీ లేవు. మెహతా ఎవరి మీద కటాక్ష వీక్షణం చేస్తే వాళ్ళే కాంగ్రేస్ అధ్యక్షులు.
తీవ్రవాదులైన తిలక్ లాలాజీలు ఆయన ఆగ్రహానికి గురయిన ముఖ్యులు ” అనేది
ప్రకాశంగారి అభిప్రాయం.
ఇలాంటి పరిస్థితుల్లో, ఆనాడు కాంగ్రెస్ పెద్దలను మంచి చేసుకుని విజిటింగ్ కార్డు
పదవి అయినా పొందగలిగితే, ప్రభుత్వాదరణ దొరికేదని దీన్ని బట్టి తెలుస్తోంది. గురజాడ
లాంటి ఆలోచనాపరుడు ఈ సంస్కృతిని ఆమోదించగలడా? అందుకే, దేశభక్తి గురించి
ఒట్టి గొప్పలు చెప్పుకోవద్దని మితవాద కాంగ్రెసుకే చురక వేశాడు.
1907 లో బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర రాష్ట్ర పర్యటన సమయంలో విశాఖపట్టణంలో
ఆయనకు అంతగా ఆదరణ రాలేదు. కాకినాడలో ఒక మోస్తరుగా విజయవంతం
అయ్యింది. తరువాత రాజమండ్రిలో జరిగిన సభ అద్భుతాలను ఆవిష్కరించింది.
తెలుగువారిలో స్వాతంత్ర్య దీప్తిని నింపిన ఒక గొప్ప సభగా చరిత్రలో నిలిచిపోయింది.
బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదిస్తూ, “భరత ఖండంబు పాడియావు”
అనే పద్యాన్ని చిలకమర్తివారు ఈ సభలోనే ఆశువుగా చెప్పారు.
ఆ తరువాత బిపిన్ చంద్రపాల్ బెజవాడ, మచిలీపట్టణాల్లో కూడా ప్రసంగించారు.
తెలుగునాట స్వాతంత్ర్య కాంక్ష కలవారందరినీ ఏకం చేసి, తన నాయకత్వంలోకి
తెచ్చుకున్నారు. వందేమాతరం ఉద్యమం తరువాత దేశంలో అతివాదులు తెలుగు నేల
మీద సాధించిన తొలి విజయం ఇది. అతివాదానికి గురజాడ అనుకూలమా.. ప్రతికూలమా
అనేది సున్నితమైన విషయం.
1897 నుంచీ 1912 వరకూ సంస్థాన వారసత్వ దావా విషయంలో అప్పారావు గారు
తలమునకలుగా ఉన్న సమయం అది. ఆ కారణంగా ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధాలు
పెట్టుకోలేకపోయినప్పటికీ, కన్యాశుల్కం నాటకంలో జాతీయ, అంతర్జాతీయ విషయాలు
కూడా ప్రస్తావిస్తూ మితవాదుల ఆలోచనా ధోరణుల్ని ఎండగట్టారు.
గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి
అంతర్జాల త్రైమాస పత్రిక
వ్యవస్థాపక సంపాదకులు: కీ.శే. శ్రీ గురజాడ వేంకట అప్పారావు