ఆదర్శం
ప్రకాశిక నిర్వహించిన 2020 దీపావళి కథల
పోటీలో మూడవ బహుమతి పొందిన కథ.
గంట నుంచీ కిందామీదా పడి ఇంటిపనంతా పూర్తిచేసుకుంది మౌనిక. ఇంత తిని, కొంత బాక్స్ లో పెట్టుకుని, అత్తగారికి బై చెప్పేసి ఇంట్లోంచి
బయటపడింది. ఉదయం ఆరు గంటలు కావస్తోంది. భానుడి నిద్రమత్తు వదల్లేదేమో- కళ్ళు నులుముకుని ఎర్రని కళ్ళతో లోకాన్ని చూస్తున్నాడు. చెట్టు, చేమ, గుట్ట- ఎర్ర నీరు కళ్ళాపి జల్లినట్టున్నాయి. అత్తగారు, భర్తతో కలిసి హనుమకొండలో ఉంటోంది మౌనిక. భర్త చిన్న వ్యాపారం చేస్తుంటే, ఆమె జనగామలో టీచర్ గా ఉంటోంది. ఇంటినుంచి అర కిలోమీటర్ నడిస్తే కానీ ఆటోలు దొరకవు. పరుగులాంటి నడకతో రోడ్డుమీదకొచ్చింది మౌనిక. తుషార బిందువులు వాలిన చిగురాకుల్లా అయ్యాయి ఆమె చేతులు. ఐదు నిమిషాల తర్వాత ఒక ఆటో వచ్చింది. అందులో వెనక సీట్లో ఇద్దరు మహిళలు కూర్చుని ఉన్నారు. షేర్డ్ ఆటోలో అది మామూలే. ఆటోలో కూర్చుని “కొత్త
బస్టాండ్’’ అంది. ఇరవై నిమిషాల్లో ఆటో బస్టాండ్ కి చేరింది. దేశంలో నిరుద్యోగానికి అద్దంలా
ఉంది ఆ బస్టాండ్. అక్కడక్కడా చెదురుమదురుగా కాకా హోటళ్లు, చాయ్ బిస్కట్దు కాణాలు. బస్టాండ్- ప్లాట్ ఫామ్ మీద గిరాకీ కోసం ఎదురు చూసే కూలీలతో బిజీగా ఉంది. అప్పుడే కదలబోతోంది జనగామ బస్సు. మౌనిక పరుగున వెళ్లి ఎక్కింది. లోపల కిక్కిరిసిన జనం లేరు కానీ, బస్సు సీట్లు ఖాళీ లేవు. బస్సు ముందు భాగంలో పైనున్న ఇనుప రాడ్ ఆధారంగా పట్టుకుని నిలబడిందామె. ఆ రాడ్ కి వేలాడుతున్న సగం తెగిన తోలు బెల్టులు ఆర్టీసీ ఆర్థిక స్థితిని అద్దంలో చూపుతున్నాయి. “టికెట్ !” మహిళాభ్యుదయానికి చిహ్నంలా, లేచిన మహిళా లోకానికి
ప్రతినిధిలా మహిళాకండక్టర్ వచ్చిఅడిగింది. “పాస్ “అని పాస్ తీసి ఆమెకిచ్చింది. సరిచూసుకుని పంచ్చే సి తిరిగిచ్చేసి “టికెట్… టికెట్” అనుకుంటూ వెనక్కి వెళ్ళింది ఆ కండక్టర్. ఒక్కసారి ఆమె వెళ్లిన వైపు చూసింది మౌనిక. వెనక లేడీస్సీ ట్ల ఆఖరి వరసలో ఒక మగ మహారాజు కూర్చుని కనిపించాడు. వస్త్రధారణను బట్టి చూస్తే చదువుకున్న మధ్యతరగతి వ్యక్తిలాగా ఉన్నాడు. ‘హు… చదువుకున్నంత మాత్రాన సంస్కారం ఉండాలని ఏముంది? దర్జాగా ఆడవాళ్ళ సీట్లో కూర్చోడానికి సిగ్గు లేదు’ అనుకుంది మనసులో. అక్కడితో ఆగలేదు. హక్కుల కోసం పోరాడే వీరనారిలా అతని దగ్గరికి వెళ్ళింది. “ఇది లేడీస్ సీట్! కాస్త లేస్తారా!” కొంచెం ఘాటుగానే అడిగింది. “అయ్యో మేడం! నేను కూర్చున్న సీటు ఆయనకు ఇచ్చాను. పాపం ఒక కాలు లేదు, కూర్చొనివ్వండి” పక్కన నిలబడిన ఆవిడ అంది. వెనక కూర్చున్న మగవాళ్ళలో ఒక వ్యక్తి – “అతన్ని లేపకండి మేడం! మీరు ఇక్కడ కూర్చోండి” అని తాను కూర్చున్న సీట్లోంచి లేచాడు. క్షణకాలం సిగ్గుతో బిక్కచచ్చిపోయింది మౌనిక. ‘ఛ! బుద్ధి లేక వెనక్కి చూశాను. తొందరపడి ఆ వ్యక్తి గురించి చెడుగా అనుకున్నాను. ఒక్క చదువుకోవటమే కాదు- పిల్లకు చదువు, బుద్ధి నేర్పే తనలో మరి ఎంత సంస్కారముంది? గురివింద చందాన ఆలోచించాను’ అని బాధపడింది. సీటు ఇవ్వబోయిన వ్యక్తిని వారించి కూర్చోమంది.
ఇంతలో బస్సు- స్టాండు మలుపులో గుంటల్లో పడి విసిరిన విసురుకి…సుడిగాలిలో చిక్కిన కాగితంలా అటూ ఇటూ ఊగింది మౌనిక. అదృష్టం బాగుండి తమాయించుకుంది. రఘునాథపల్లి బస్టాండులో ఆగింది బస్సు. ఖాళీ అయిన సీట్లో మౌనిక కూర్చుంది. ఒక ముగ్గుబుట్ట జుట్టావిడ కూరగాయల
బుట్టతో బస్సు ఎక్కింది. వయసు సుమారుగా డెబ్భై ఏళ్ళు ఉండొచ్చు, ఆమె ముఖంమీద చర్మం నీరందని బీడు భూమిలా పగుళ్లువారి ఉంది. కళ్ళు నూనె నిండుకున్న దీపావళి ప్రమిదలో చివరలు కాలిన వొత్తుల్లా ఉన్నాయి. బడిపిల్లలు కొందరు బిలబిలా బస్సు ఎక్కారు-బార్డర్ లో సైనికుల్లా వీపున
బండెడు బరువులతో! ముసలి దగ్గులా ‘కర్రు’న గేరు మార్చిన శబ్దంతో కదిలిందా ముసలి బస్సు.
“వేడి వేడి సమోసా” అంటూచల్లని సమోసాను వేడిగా అమ్ముతున్న బాలకార్మికుడొకడు కదిలిన బస్సులోంచి దూకేశాడు. బస్సు జనగామ చేరేవరకూ పక్కన కూర్చున్న ముసలావిడతో మాట్లాడింది
మౌనిక. భర్త చనిపోయినా ఒక్కగానొక్క కొడుకును రెక్కలు ముక్కలు చేసి చదివించానని, ప్రభుత్వ ఉద్యోగం వేయించి పెళ్ళిచేశానని ఆవిడ చెప్పింది. ఉన్న అరెకరంలో కూరగాయలు పండించి జనగామలో అమ్ముకుని వస్తానంది. ‘ఈ వయసులో కూడా పని చెయ్యాలా అవ్వా’ అంటే –
‘ఖాళీగా ఉండలేనమ్మా! ఒకరికి బరువుగా బతకటం ఇష్టం ఉండదు, కడుపుకింత తిన్నప్పుడు కాల్చేతులకింత పని జెప్పాలె’ అంది. ఒంట్లో శక్తి ఉండీ పనీ పాటా లేకుండా… ఖాళీగా ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలు మేస్తూ, సోమరులుగా నిద్ర పోతున్నవాళ్ళు ఎందరో? వాళ్ళకి ఈ ముసలవ్వ
ఒక ఇన్స్పిరేషన్ ఎందుకు కాదో అర్థం కాలేదు మౌనికకు. స్కూలుకి వెళ్ళాక బస్సులో జరిగింది అంతా తన సహ ఉద్యోగి-స్నేహితురాలితో పంచుకుంది. బాధ పంచుకుంటే గుండెబరువు తగ్గుతుంది కదా అని. కాలు లేని వ్యక్తి పట్ల తన దయలేని ప్రవర్తన గురించి చెప్పి బాధపడింది.
‘అతను దివ్యాంగుడని నీకు ముందుగా తెలియదు. కాబట్టి ఆ తర్వాత జరిగిందానికి నీ తప్పేం లేదు. అనవసరంగా మనసులో పెట్టుకుని బాధపడకు!’ అని ఒప్పించేలా చెప్పింది ఆ మిత్రురాలు.
గింజ తీసిన దూదిపింజలా తేలికపడిన గుండెతో మౌనిక క్లాస్ కి వెళ్ళింది. ఆ రోజు అనుభవాన్ని పిల్లకు చెప్పింది. “దేశాన్నిముందుకు నడపాల్సిన యువకులు ఎన్నటికీ సోమరులుగా మారకూడదు” అంటూ ముసలవ్వ మాటలను ఉదాహరించింది మౌనిక!