9.8 C
New York
Monday, November 25, 2024

అర్ధాంగి

అర్ధాంగి

ప్రకాశిక నిర్వహించిన 2020 దీపావళి కథల
పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ.

షిర్డికి మనం వెళ్తున్నట్లు మామయ్యగారికి చెప్పారు కదా!’… నిలదీసినట్టు అడిగింది నీలిమ. ‘ఆ చెప్పా!’… క్యాజువల్ గా అన్నాడు వేణు. ‘మరంత అర్జంటుగా చెప్పాల్సిన అవసరం ఏంటో’… ‘అదేంటీ అలా అంటావ్? జస్ట్
చెప్పాలనిపించింది, చెప్పాను. అలాగే అత్తామామయ్యలకీ చెప్పాను’
‘మనం షిర్డి వెళ్తున్నామని తెలిస్తే వాళ్ళేవో డబ్బులు ఇస్తారని మీ
ఆశ!’ ‘ఆశ కాదు’‘పోనీ మరొహటి. చిన్న ఉద్యోగం చేస్తూ నాలుగు డబ్బులు
కూడబెట్టి ఊరెళ్దామని అనుకుంటే, మీరు చేసిన నిర్వాకం ఇదీ”-
ఆమె స్పీడుగా విసిరిన గిరాటేసిన గరిట పులుసు గిన్నెలో పడి కొన్ని

తుప్పర్లు అతనిమీద పడ్డాయి. ‘నీ ఉద్దేశం అసలు అర్థం కావడం లేదు. పెద్దవాళ్ళకి చెప్పడం తప్పా?’.. ‘మీరు చెప్పడం వల్ల ఏం జరిగిందో తెలుసా?’ ‘ఏవైందీ’ ‘ఇందాక నాకు మామయ్యగారు ఫోన్ చేసి, సరిగ్గా మనం వెళ్తామన్న తేదీకి రెండ్రోజులు ముందు ఇక్కడికి వస్తానని చెప్పారు!’ ‘మరి నాకు చెప్పలేదే?’ ‘మీరు ‘బాగా బిజీ’ అని! అందుకే నాకు ఫోన్చే శానన్నారు. అత్తగారితో కలిసి వస్తారుట’ బాగా బిజీ అన్నమాటలోని వ్యంగ్యాన్ని అర్ధం చేసుకున్నా పట్టించుకోనట్లు – ‘అవునా!’… ‘అదే కదా నేను ఏడ్చేదీ… మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్దామన్నా మీదగ్గర డబ్బులుండవ్. పోనీ ఏదో బోనస్ కలిసి వచ్చి షిర్డి వెళ్దామనుకుంటే, ఇదిగో ఇలా మరో అడ్డు’ అంటూనే తన కంచంలో హఠాత్తుగా మజ్జిగ పోసేసుకుంది.


చిన్న ఉద్యోగి వేణు. అంత పెద్దసిటీలో నీలిమతో కాపురం పెట్టి కొన్ని సంవత్సరాలే
అయింది. వాళ్ళకి సంవత్సరం వయసున్న పాప. ఇంటి అద్దె, సరుకులు, బస్ పాస్,
స్కూలు ఫీజులు, పుస్తకాలు- వీటికి బొటాబొటిగా సరిపోయే జీతం వేణుది. ఇతని
ఇబ్బందులు చూసిన తండ్రి ఎప్పుడో కాస్త డబ్బు సర్దుబాటు చేసినా, ఆయన అనే
మాటలు నీలిమని బాగా మానసికంగా ఇబ్బంది పెడుతుంటాయి. వేణు అటు తండ్రిని
డబ్బు అడగలేక సతమతమవుతున్నట్లు నీలిమకి తెలుసు. అందుకే చిన్న స్కూల్లో టీచర్
గా ఉద్యోగం చేస్తూ ఏదో అలా కాపురాన్ని నెట్టుకొస్తోంది.
అనుకున్నట్టే మామగారు, అత్తగారు సెలవురోజే వచ్చారు. అది వేణుకీ నీలిమకీ
వాళ్ళిచ్చిన బంపర్ ఆఫర్. ఎందుకంటే రైల్వేస్టేషన్ కి వెళ్ళి వాళ్ళని ఇంటికి తీసుకురావాలి
వేణు. మళ్ళీ మరో సెలవురోజు వరకు ఉంటారు. ఎప్పుడొచ్చినా అదే తీరు. ఒకరకంగా
నయం. మరో రకంగా నరకం. వారానికి ఒకేరోజు సెలవు వాళ్ళిద్దరికీ. అందులో సగం
రైలుకోసం, బస్సులెక్కి వెళ్ళిరావడానికీ సరిపోతుంది. కాకపోతే లీవ్ వేస్ట్ అవ్వదు.
అత్తమామలు వస్తే సెలవు పెట్టాలి నీలిమ. అదో రకమైన ఇబ్బంది. అసలు స్కూల్లో
పనిచేయనక్కర్లేదు ఆమె. మొహమాటం వీడి డబ్బులు అడిగితే మామగారిస్తారు – కానీ
ప్రతీ పైసాకి లెక్కకట్టినట్టు దెప్పుతుంటారు. అది పట్టించుకోకపోతే ఆయనంత మంచివాళ్ళు మరొకరుండరు. కానీ ఆత్మాభిమానం దెబ్బతినేలా దెప్పుతుంటే సహించడం కష్టం. నీలిమకి ఎదురైన సమస్య అదే! ఆరోజు మధ్యాహ్నం భోజనం చేస్తుండగా వేణువాళ్ల నాన్నగారు ‘మీకో విషయం చెప్పాలి’ అని హఠాత్తుగా అన్నారు. ‘మీకు తెలుసుకదా ఊళ్ళో ఇల్లుపాడుపడుతోంది. అది అమ్మేసి కొత్త ఇల్లు కొందామనుకుంటున్నా’ అని చెప్పి ఆగారు. ‘మళ్ళీ కొత్త ఇల్లు కొనుక్కోవడమెందుకూ…మాతో పాటే ఉండొచ్చుగా ఇక్కడే’ అంది నీలిమ. ‘మేమిక్కడ ఇమడలేం… అక్కడైతే అంతా తెలిసినవాళ్ళూ, చుట్టాలూ బంధువులూనూ’ ‘నిజమేలెండి, ఇక్కడ ఆస్పత్రికెళ్ళాలన్నా చాలా ఇబ్బందే’ ఒప్పుకొంది నీలిమ. ‘అందుకే అక్కడ ఇల్లు కొనేస్తే పడుంటుంది కదా. ఇల్లు అమ్మినా డబ్బు సరిపోలేదు. ఇంట్లో బంగారం,బ్యాంకులో దాచిందీ అంతా తీసినా సరిపోవడం లేదు. కాబట్టి నీ గాజులు ఇస్తే వాటిని తాకట్టు పెట్టాలనుకుంటున్నా’… నీలిమతో అన్నారాయన. చటుక్కున వేణుకేసి చూసింది నీలిమ.. చురుక్కుమంది వేణుకి. కూరలో వేసిన మిరపకాయలన్నీ ఒక్కసారే నమిలినట్లు ఫీలయ్యిపొలమారాడతను. పక్కనే ఉన్న అతని తల్లి నీళ్ళగ్లాసు అందించింది. వేణు నెమ్మదిగా గొంతు సవరించుకుని ‘ఇప్పుడా గాజులు తాకట్టు పెడితే ఎంతొస్తుందీ… అయినా అది ఏమూలకి సరిపోతుందీ?’ అన్నాడు నెమ్మదిగా. ‘అదే నేనూ చెప్పాను. కోడలి మెడలో ఎలాగూ బంగారు మంగళసూత్రం లేదు…పసుపుతాడు కట్టుకుని తిరుగుతోంది. ఉన్న గాజులు తీసుకోవడం ఎందుకని అన్నా మీ నాన్న వినిపించుకోవడం లేదు’ స్క్రిప్ట్ చదివినట్టు చెప్పింది తల్లి.

‘అదేంటీ మావగారూ! సంవత్సరం కింద ఏదో స్థలం కొనాలని నా మంగళసూత్రం పట్టుకెళ్ళారు! ఇప్పుడు
గాజులంటున్నారు. ఇవి తప్ప నాదగ్గర బంగారం ఏవుందీ?’ గొంతు విప్పింది నీలిమ. ‘నీ దగ్గర సూత్రాలు తీసుకెళ్ళానని నువ్వు అంటున్నావు! ఆస్పత్రి
ఖర్చులనీ,ఇంటి అద్దె అనీ- ఎన్నిసార్లు డబ్బు
తీసుకున్నాడు వీడు’… ‘ఎంత తీసుకున్నా మంగళసూత్రాలు కుదువపెట్టినంత కాదు కదండీ? అదేదో మేం తాకట్టు పెట్టుకున్నా అంతకన్నా ఎక్కువ డబ్బులొస్తాయి. మీరిచ్చే డబ్బులకి, మీరు పట్టుకెళ్ళిన బంగారానికీ ఎంత తేడా ఉందో మీకు నేను చెప్పాలా’ నెమ్మదిగా అన్నాసూటిగానే అడిగేసింది.
‘ఇప్పుడీ కొత్త ఇల్లుకొంటే ఎవరికొస్తుంది…వీడికే కదా తక్కువ ధరకు వస్తోందని కొనాలనుకున్నాను. నీ బంగారం నీదగ్గరే ఉంచుకో…నాకేం అక్కర్లేదు. కొన్న బంగారం ఒంటిమీద దిగేసుకోవడానికి కాదు, అవసరానికి అక్కరకొస్తుందని! ఉంగరాలూ
గాజులూ బంగారంతో చేసినవే వేసుకున్న కుటుంబం నుంచి వచ్చావని మరిచిపోయాను’… ఆమె పుట్టిల్లు స్థితి గురించి గురిచూసి బాణం వదిలాడాయన.

కేవలం గాజులకోసం మా వాళ్ళని ఏవీ దెప్పిపొడవనక్కర్లేదు… వాళ్ళు ఎక్కడెక్కడి
బంగారాన్నీ తాకట్టు పెట్టుకోవాలని అనుకోరు’
‘అంటే నేనే తేరగా మీదగ్గరా, అందరి దగ్గరా బంగారాన్ని లాక్కుని తాకట్టు
పెడతానని నీ వెక్కిరింత. అంతే కదా!’
‘అలా నేను అనలేదు’…
‘నువ్వు ఎలా అన్నా పడటానికి రాలేదు. ఇప్పుడు నువ్వు గాజులిస్తే పట్టుకెళ్తా.
లేకపోతే జీవితంలో వీడికి పైసా పంపను. నువ్వు వీడూ జీతాలు సంపాదించి పిల్లకి
కావాల్సిన అన్నీ సమకూర్చేసుకోండి. పెరుగుతున్న పిల్ల అది. అవసరాలకోసం దమ్మిడీ
అడక్కండి. బైక్ కొందామన్నా మళ్ళీ పెట్రోలుకి నేనే డబ్బులివ్వాలి. వీడినీ
నీ ఉద్యోగాన్నీ చూసుకుని అంత మిడిసిపడకు!’… కోపంతో
కంచంముందు నుంచి లేచారాయన.


‘చూడమ్మా… ఎంత కాదన్నా మళ్ళీ మీ మామగారినే డబ్బులడగాల్సి వస్తుంది. అనవసరంగా పంతాలకి పోకు’
అనునయించిందామె అత్త. వేణుకేసి తీక్షణంగా చూసి, గాజులు అక్కడే తీసేసి అత్తగారికిచ్చేసింది నీలిమ.
‘ఇవి తీసుకెళ్ళండి… మేం ఎప్పుడు అడుక్కున్నా ఇంత పడేయండి!’ అంటూ కోపంగా అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది.
బిక్కచచ్చి అక్కడే నిలబడ్డ వేణునీ, భోరున రోదిస్తోన్న నీలిమనీ ఏవీ పట్టించుకోకుండా-వాటిని అందుకుని పెట్టెలో దాచేశారాయన. ఆరాత్రి… తలకింద చేయి పెట్టుకుని పైన సీలింగు ఫ్యాన్ వేపు చూస్తూ ఏదో ఆలోచిస్తూన్న వేణుతో లోగొంతుతో అంది – ‘ఇప్పుడో ఇరకాటంలో పడ్డాం’
‘అవును, ఏం చేయాలో అర్థం కావడం లేదు’
అనవసరంగా కోపంలో గాజులు ఇచ్చేశాను కానీ, తర్వాత ఆలోచిస్తే తెలిసింది… నేనెంత తెలివితక్కువ పనిచేశానో అని’… ‘ఇప్పుడనుకుని ఏం లాభం? ఎల్లుండి సెలవు వరకూ ఆగి గాజులు ఇవ్వాల్సింది’ ‘నిజమే’ తనలో తాను అనుకుంది. వెంటనే ‘అవునూ, అప్పుడు మాత్రం ఎలా ఇస్తాం? దొరగారు ఒరిజినల్ గాజులు- అదే తాకట్టు పెట్టిన గాజులు తేగలరా’ చిన్న నవ్వూ, సన్నపాటి ఆందోళన- రెండూ కలగలిపి అంది. అతను నవ్వలేదు – నవ్వలేడు కూడా! ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు. రెణ్ణెళ్ళ ముందు జరిగిన సంఘటన దగ్గరికి అతను వెళ్ళిపోయాడు. నీలిమకి అర్థమై, మౌనమైంది. చంటిపిల్లకి ఒళ్ళు కాగిపోతోంది. రాత్రి అవుతోంది. వేణు వచ్చేస్తూ ఉంటాడని అతనికి ఫోన్ చేయలేదు నీలిమ. ఏ సిటీబస్సులోనో వేలాడుతూ ఉంటాడని, ఎక్కడ ఎక్కుతూ దిగుతూ ఉంటాడోనని ఫోన్ చేయలేదు. అయితే అనుకోకుండా ఆ నెల వన్అ వర్ పర్మిషన్ మిగిలిపోవడంతో బాస్ కి చెప్పి తొందరగానే ఇంటికొచ్చేశాడు వేణు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇంటి ఓనర్, పక్కింటివాళ్ళు పెళ్ళికెళ్ళారు. మరీ ఎక్కువ ఆలోచించకుండా డాక్టర్ దగ్గరికి అలాగే తీసుకెళ్లాడు. పిల్ల పరిస్థితి చూసి, ఆస్పత్రిలో
అడ్మిట్ చేసి, డాక్టర్ ట్రీట్‌మెంట్ మొదలు పెట్టాడు. ఇప్పుడు చాలా పెద్దమొత్తంలో కావాలి. అప్పు పుట్టదు ఎలా? తండ్రికి ఫోన్ చేస్తే ‘ఈ నెలలో ఇవ్వలేన’ని చెప్పడంతో నీలిమ గాజులు తాకట్టు పెట్టాడు వేణు.పిల్ల బతికితే చాలనుకున్నారు. డాక్టర్ సరైన వైద్యం అందించడంతో పిల్ల చలాకీగా
ఇంటికొచ్చింది. ఆ తర్వాత స్కూలుకి వెళ్ళాలి కాబట్టి, చేతులకి నాలుగు మట్టి గాజులతో పాటు వన్ గ్రాము గోల్డ్ గాజులు రెండు ఆ చేతికొకటి ఈ చేతికొకటీ వేసుకుని కాలం వెళ్ళబుచ్చుతోంది నీలిమ. ఈరోజు మామగారు అన్నమాటలకి పంతంతో ఆ గిల్ట్ నగలిచ్చేసింది. ఆ గాజులు గిల్టువని ఆమె తెలుసుకునే లోపు ఆయన సూట్ కేసులోకి వెళ్ళిపోయాయి. ఏం చేయాలో పాలుపోని సంఘటన అది. ‘పోనీ మామయ్యగారికి అసలు సంగతి చెప్పేద్దామా’… ‘నీకేమన్నా పిచ్చా… ఆ పని ఎందుకు చేశావని అడగరూ?’ ‘చంటిదానికి బాగోలేదని ఆస్పత్రిలో జాయిన్ చేశామని తెలుసుగా. అందుకే ఖర్చు అయిందని చెప్పేద్దాం’
‘అది గాజులు ఇవ్వకముందు చెప్పాలి. ఇప్పుడు కాదు!’
‘మరి అలాగే పంపిస్తారా’
‘చూద్దాం రెండ్రోజులు ఉందిగా! ఈలోగా ఆలోచిద్దాం’ మర్నాడు ఆఫీసుకి వెళ్ళినా, గాజుల గురించే దిగులు. కనిపించిన ప్రతీవాణ్ణీ అప్పు కోరాడు…శాలరీ అడ్వాన్స్ పెట్టాడు. బాస్ ని డైరక్ట్ గా అప్పు అడిగాడు. ఆయనే కళనున్నాడో డబ్బు కొంచెం ఇచ్చాడు. అంతా బోనస్ తో కలిపి గాజుల్ని తాకట్టునుంచి విడిపించాలి. ఇక మిగిలింది- తండ్రికి అసలు సంగతి ఎలా చెప్పడం? 24 క్యారెట్ల
ప్రశ్న అది. ‘నిజం చెప్పేద్దాం నీలిమా… ఏదైతే అదే జరుగుతుంది!’..నిస్సత్తువతో అన్నాడు
వేణు. ‘గజేంద్రమోక్షం’ గుర్తుకొచ్చింది నీలిమకి. ‘ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి
ఇక తన వల్ల కాదని వేడుకున్న ఏనుగుకి అభయం ఇవ్వలేదా ఆ శ్రీహరి? మనమింత
ప్రయత్నం చేశాం…దేవుడికి దణ్ణం పెట్టి కోరుకుందాం’ ‘‘మీరు ఇంత కష్టపడ్డారు… రేపు ఎలాగైనా గాజులు తెస్తాను, ఆ మార్వాడీ షాప్ఓ నర్ భార్య నాకు స్నేహితురాలే. ఫోన్ చేసి పనివాళ్ల చేత ఓ అయిదు నిమిషాలు షాప్ఓ పెన్ చేయమని రిక్వెస్ట్ చేస్తా. ఒకవేళ తేలేకపోతే సోమవారం కొరియర్లో పంపేద్దాం. అంతేగాని నిజం ‘ఇప్పుడు’ చెప్పకూడదు’ అంటూ భర్తకి భరోసా ఇచ్చింది నీలిమ.

ఆదివారం వచ్చేసింది. ఉదయాన్నే శేటు భార్యకి ఫోన్ చేసింది నీలిమ. ఆమెకి
నీలిమ అవస్థలు తెలుసుకాబట్టి, పనివాడికి చెప్తానని… పదిగంటల కల్లా షాప్ దగ్గర
ఉండమని హామీ ఇచ్చేసింది. రైలు ఎక్కించడానికి మూడుగంటల ముందే ఇంట్లో
హడావుడి మొదలైంది. సిటీ బస్ ఎక్కి రైల్వేస్టేషన్ కి వెళ్ళాలంటే, దార్లో ట్రాఫిక్ జామ్
ఉంటుందేమో అని గాభరా పెట్టసాగారు నీలిమ మామగారు. ఆఖరికి కొరియర్లో
పంపడమే బెటర్ అని భావించారు వేణు, నీలిమలు.
ఫర్లాంగు దూరంలో ఉన్న బస్టాండ్ కి తల్లిదండ్రులను వేణు తీసుకెళ్ళాడు. చివరి
ప్రయత్నంగా – పసిపాపని ఎత్తుకుని షాప్ దగ్గరకి వెళ్లింది నీలిమ. పనివాడు వచ్చి
డబ్బు తీసుకుని బంగారం గాజులిచ్చేశాడు. అవి పట్టుకుని ఆదరాబాదరాగా నీలిమ
బస్టాండ్ కొచ్చింది. అప్పటికి బస్సు రాకపోవడంతో ఓ చెట్టుకింద నిలబడ్డ వేణుని,
అత్తగారూ- మామగారుని చూసి అక్కడికి వెళ్ళింది. నీలిమకి పట్టిన చెమట్లు చూసి
అత్తగారు ‘ఎందుకమ్మా ఇలా వచ్చావ్? ఏవైనా మరిచిపోతే తర్వాత తీసుకెళ్ళేవాళ్ళం
కదా’ అని కొంగుతో ఆ నుదుటిపై చెమటని తుడిచింది.
‘మామయ్యగారూ! ఇవి అసలు గాజులు… మొన్న మీకిచ్చినవి గిల్టు గాజులు. ఇవి
బీరువాలో పెట్టి స్కూలుకి ఆ గిల్టు గాజులు పెట్టుకుని వెళ్తున్నాను. కోపంతో
మీకిచ్చినప్పుడు ఆ సంగతి గుర్తురాలేదు. బీరువా సర్దుతుంటే ఇవి కనబడగానే
తీసుకొచ్చాను. మీరు మీ ఊళ్ళో తాకట్టుపెట్టడానికెళ్తే పరువు పోతుందని గాభరాతో
వచ్చేశాను’ అని ఆయాసంతో చెప్పింది.
‘చూడమ్మా! నీ గాజులు తీసుకెళ్దామని వచ్చినా, అవి కొత్త ఇంటికి అచ్చిరావని

మామయ్యగారితో చెప్తూనే ఉన్నాను. తిరిగి ఇవ్వడానికి ఆయనకి అహం అడ్డొచ్చింది. రైల్వేస్టేషన్లో వీడి చేతికిచ్చి పంపించేస్తానని జేబులో పెట్టుకుని ఇక్కడికొచ్చారు. నీ బంగారం నీదగ్గరే ఉంచుకోమ్మా!’ అంది అత్తగారు. ‘అవునమ్మా! ఊరు బయల్దేరేముందునుంచీ మీ అత్తగారు అదేపాట. నాకు డబ్బుకిబ్బంది ఎదురవుతుందని నీ గాజులు తీసుకుందామనుకున్నా. ఇవి గిల్టు గాజులో, బంగారం గాజులో నాకు తెలీదు. తీసుకున్నాక తిరిగి ఇద్దామంటే ఈగో వెనక్కి లాగింది. అందుకే సూట్ కేసులో అదే రోజు పెట్టేసినా, రైల్వేస్టేషన్లో తిరిగి ఇవ్వాలని ఇదిగో జేబులో పెట్టుకున్నా. ఇవి నీ దగ్గరే ఉండాలి. ఆలోచిస్తే మీ అత్తగారు చెప్పిందీ కరక్టే… నిన్ను ఏడిపించి నీ బంగారంతో ఇల్లుకి ఖర్చుపెట్టడం మంచిది కాదు, తీసుకో’ ‘ఫర్వాలేదు మావయ్యగారూ! ఇప్పుడు రోజూ ఇవి పెట్టుకోవడం లేదు కదా. మీకు ఈ రకంగానైనా పనికొస్తే అదే చాలు… పదివేలు!’..
‘సరేనమ్మా ఇవ్వూ’ అని బంగారం గాజులు తీసుకుని కొడుకుతో ‘ఒరేయ్! ఇదిగో ఈ గాజులు తీసుకుని జాగ్రత్తగా జేబులో పెట్టుకో. ఇంటికెళ్ళగానే కోడలికిచ్చేయ్’ అని ఇంతకు ముందు ఇచ్చిన గిల్టువీ, అప్పుడే ఇచ్చిన బంగారం గాజులూ కలిపి కొడుక్కి ఇచ్చేశారాయన. ఇంతలో బస్సు రావడంతో వేణు తన తల్లిదండ్రులను ఎక్కించి, నీలిమకి థ్యాంక్స్చె ప్పి తానూ బస్సెక్కాడు. బస్సు కనుమరుగైనంత వరకూ టా టా చెప్తూ, ఇంటికి నడుస్తూ ఆమె ఆలోచిస్తోంది. ‘డబ్బులేకపోయినా ఆస్పత్రిలో జాయిన్ చేసుకున్న డాక్టర్, అడగ్గానే డబ్బు ఇచ్చిన బాస్, ఫోన్ చేయగానే సెలవు రోజున షాప్ ఓపెన్ చేయించిన శేటు భార్య, ఆదివారం అయినా దుకాణానికొచ్చి గాజులు ఇచ్చిన పనివాడు… వీళ్ళ మనసులన్నీ బంగారమే కదా! వయసువల్ల కొడుకుమీద అధికారం చలాయించాలనుకున్నా … తర్వాత పరిస్థితి తెలుసుకున్న అత్తగారూ, మామగారి మనసూ బంగారమే కదా. ఎంత ఎదిగినా
ఒదిగి ఉండాలని తండ్రిమాటకి ఎదురు చెప్పలేని తన భర్తా బంగారమే. తనతోపాటు
ఎండలో తిరిగి వాడిపోయిన చంటిబిడ్డ కూడా బంగారమే! ఇంతమంది బంగారం
లాంటి వాళ్ళు తనచుట్టూ ఉన్నా, ఆరోజు గాజులకోసం ఎందుకు గొడవపడ్డానా…అని
ఆలోచిస్తూ ఇంటికెళ్తోంది నీలిమ.

Vote this article
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles