- సమాజపరంగా…
వాల్మీకి రామాయణ కావ్యం మానవ విలువలకు మణిదర్పణం. గురజాడ కన్యాశుల్కం
నాటకం ఎవరు ఎలా ఉండాలో ఎవరు ఎలా ఉండకూడదో చూపించే సమాజ దర్పణం.
వాల్మీకి రామాయణం అన్నాతమ్ములు, తండ్రీతనయులు, భార్యాభర్తలు మొదలైన
సంబంధాలకు ముంజేతి కంకణం. గురజాడ కన్యాశుల్కం, మనుషుల్లో ఉండే కపటత్వం,
మోసపూరిత వ్యవహారాలు, సాంఘిక దురాచారాలు ఎత్తిచూపడంతో పాటు భాషా
వ్యవహారాలకు మణిమండపం. వాల్మీకి పాత్రలు స్వభావాలు మార్గదర్శకాలు. గురజాడ
పాత్రల స్వరూప స్వభావాలు సజీవ చిత్రాలు. ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. - రసపరంగా:
‘ఏకో రసః కరుణ ఏవ, అని ఆలంకారికులు సిద్ధాంతీకరించారు. సమాజాన్ని కదిలించే
స్వభావం కలది కరుణ రసమే. కరుణ రసానికి కంటతడి పెట్టనివాడు ఉండడు. ఎవడో
నీరస హృదయుడు తప్ప. అలాంటి, కరుణ రసమే వాల్మీకిని కదిలించింది. ఆదిశ్లోక
ఆవిర్భావానికి నాంది పలికింది.
జంట పక్షుల్లో ఒకదాన్ని చంపినందుకే, వాల్మీకి హృదయం విలవిల్లాడింది.
శోకహృదయంతో శ్లోకమైంది.
ఇక, గురజాడ గుండె కరుణా రస నిర్భరమై, ముత్యాలసరం పుత్తడిబొమ్మయై పూర్ణ
రసావిష్కరణ జరిగింది. విశ్వ విఖ్యాతమైంది.
‘భక్త్యాయుక్త్యాచ, బుద్ధ్యాచ
జ్ఞేయం రామాయణార్ణవమ్’
భక్తిచేత భాగవతాన్ని, భక్తిచేత యుక్తి చేత భారతాన్ని, భక్తి చేత, యుక్తి చేత, బుద్ధిచేత
రామాయణ సముద్రాన్ని తెలుసుకోవాలి, ఈదాలన్నారు.
అదీ వాల్మీకి గొప్పతనం.
ఇక, గురజాడ, కన్యాశుల్కం పోయి ఎన్నోఏళ్ళు అయినా, ఇన్నేళ్ళూ కన్యాశుల్కం
నాటకం బతికి బట్టకట్టడానికి, మరి ఎన్నేళ్ళు అయినా చదువుకోవడానికి, ప్రదర్శించడానికి
సరిపడే శక్తికలది కాగలగడానికి కారణం, కన్యాశుల్కంలోని సజీవపాత్రలు, మాండలిక
భాష, పాత్రల స్వభావ చిత్రణం ఇంకా ఎన్నైనా చెప్పవచ్చు.
ఒక్కమాటలో చెప్పాలంటే, గురజాడ కవితాశక్తిని ఎవరైనా కొలిచి మహాకవి అని
చెప్పడానికి, ఒక్క దేశభక్తి గేయం చాలు. దానికి ఎన్ని పేజీల వ్యాఖ్యానం అయినా
చాలదుగాక చాలదు.
అందుకే గురజాడను అభినవ వాల్మీకి అనగలిగాను. ఆదికవిగా వాల్మీకికి సాహితీ
లోకంలో ఎంత సుస్థిరం ఉందో ఆధునిక అగ్రగణ్య మహాకవిగా గురజాడకు అంత సుస్థిర
స్థానం ఉంది. ఎప్పటికీ ఉంటుంది.
గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి
అంతర్జాల త్రైమాస పత్రిక
వ్యవస్థాపక సంపాదకులు: కీ.శే. శ్రీ గురజాడ వేంకట అప్పారావు