గురజాడ – సంగీతజ్ఞానం ఉన్నవారని చాలామందికి తెలియకపోవచ్చు. మద్రాసులో
ధనమ్మాళ్ అనే సంగీత విద్వాంసురాలు కచేరీ చేస్తుంటే, ఆమె పాడిన కీర్తనలు ముఖ్యంగా
దర్బారు, భైరవి, సావేరి, యదుకుల కాంభోజి, పున్నాగవరాలి రాగాలు గురజాడ వారిని
మంత్రముగ్ధుల్ని చేశాయట. అంతేకాదు, ఆరోజుల్లోబాగా కచేరీలు చేసిన వారెవరూ ఆమె
గాత్రం ముందు, ఆమె స్వరప్రస్తారం ముందు సరితూగలేరని మెచ్చుకున్నారు. అంటే,
గురజాడకు మంచి సంగీత పరిజ్ఞానం ఉంటేనే కదా రాగాలు, వాటి మర్మాలు తెలిసేది.
ఇదంతా 1895 ఏప్రిల్ 21వ తేదీ డైరీలో ఉంది.
గురజాడ – వైణికుడు : గురజాడ సంగీత పరిజ్ఞానే కాదు వీణ వాయించడంలో నేర్పరి
అని కూడా తెలుస్తుంది. గురజాడ వీణవాయిస్తూ ఉండగా గిడుగు సీతాపతిగారు చూసినట్టు
1895 ఏప్రిల్ 21 తేదీ డైరీని బట్టి తెలుస్తుంది.
అందుకే గురజాడవారి సంగీత పరిజ్ఞానం, వీణావాదనం వంటి విషయాలు కూడా
పరిశోధనలో వెల్లడి చేయాల్సిన అవసరం ఉంది. చాలా మంది పరిశోధనలకు సంగీత
పరిజ్ఞానం ఉండకపోవడం వల్ల ఆ జోలికి పోవడంలేదనిపిస్తుంది.
గురజాడవారికి సంగీత పరిజ్ఞానం బాగా ఉండబట్టే ముత్యాలసరాలు ఛందాన్ని
సృష్టించే శక్తి వారికి కలిగింది. అందుకే అది ఏ రాగంలో గానం చేసినా ఒదిగే స్వభావం
కలది అయింది. (ఆ పురస్కార సభలో నేను మూడు నాలుగు రాగాల్లోపాడి సభ్యులకు
వినిపించాను).
ఆ) వాల్మీకి – గురజాడ : గురజాడలో వాల్మీకి పోలికలు చాలా కనిపిస్తూ ఉండడంలో
గురజాడను అభినవ వాల్మీకి అని అన్నాను.
- కవితాపరంగా: అనంత సాహిత్యానికి వాల్మీకి ఆదికవియై ‘అనుష్టుప్ ఛందం’ లో
ఆది శ్లోకం రాస్తే, ఆధునికాంధ్ర సాహిత్యాన్ని ఓ మలుపు తిప్పి గురజాడ ‘ముత్యాలసరం’
అనే కొత్త ఛందాన్ని రాశారు. - భాషాపరంగా : వేద వాక్ మయ, లౌకిక వాక్ మయంగా రెండు విధాలుగా
ఉంటుంది. వేద వాఙ్మయం అందరికీ అర్థం కాదు. లౌకిక వాక్ మయం సాధన చేస్తే తప్పక
అర్థం అవుతుంది. అలాంటి లౌకిక వాక్ మయంలో అనుష్టుప్ ఛందస్సు ఏమాత్రం
సంస్కృత శబ్దజ్ఞానం ఉన్నా అర్థం అవుతుంది. అలాంటి సరళమైన సంస్కృత పదజాలంలో
వాల్మీకి 24 వేల శ్లోకాలతో రామాయణం రచన చేశాడు.
మన గురజాడ, అప్పటివరకు పద్యసాహిత్యంతో పరవళ్ళు తొక్కుతున్న
ఆంధ్రసరస్వతికి, ముత్యాలసరాలు మెడలోవేసి సామాన్యులకు సైతం చూడ్డానికి అర్హత
కల్పించాడు.
వాల్మీకి శ్లోకం చూడండి:
“గగనం గగనాకారం – సాగరస్సాగరోపమః:
రామరావణయోర్యుద్ధం – రామరావణయోరివ ”
ఆకాశం ఆకాశంలానే ఉంది. సముద్రం సముద్రంలానే ఉంది. రామ రావణ యుద్ధం,