ఇంద్రజుండని లోకమెన్ని పల్క
పెద్దల కడ భక్తి, పిన్నల యెడ రక్తి
నెరపువాడెవడన్న నరుడెయనగ” అన్నారు.
ఏడు లోకాల్లో సాటిలేని విలుకాడు అర్జునుడని, సాటి వారిని ఎంతో ఆదరంతో చూసే
స్వభావం కలవాడని, విద్యల్లో మంచి నేర్పరి అని, పెద్దల పట్ల భక్తి, చిన్నవాళ్ళపై అనురాగం
కలిగేవాడు ఆ అర్జునుడని సరళ సుందరంగా వర్ణించారు. పద్యంలో కాఠిన్యం ఎక్కడా
లేదు. సీసపద్యం నడకను అద్భుతంగా నడిపించారు.
పుష్పలావికలు : ఇందులో మగవాళ్ళ స్వభావం ఎంత అందంగా చెప్పారో చూద్దాం.
ఉ. “చక్కదనంబునశ్వరము సత్యము, మక్కువలెల్ల కాలముల్
మిక్కుటమై చెలంగునొకొ, మిత్రమ! చీమలు చుట్టు ముట్టుచుం
జక్కెర చెల్లుదాక బలు సందడి జేయుచు వీడు కైవడిన్
జొక్కపు ప్రాయమేగుతలరి సున్న కదా మగవారి మక్కువల్”
అందం ఉన్నంతవరకే మగవాళ్ళు ఆడవాళ్ళను మక్కువతో చూస్తారు. వయసుడిగి
అందం తగ్గేసరికి, పంచదార అయిపోయినపుడు చీమలు చెదిరిపోయినట్టు చెదిరిపోతారని
చెప్పారు.
ఇలా ప్రాచీన కవులకు ఏ మాత్రం తగ్గకుండా, సరళత్వం, సందేశాలను బిగించి
తనదైన శైలిలో గురజాడ పద్య రచన చేశారు.
మెరుపులు : లోకాన్ని, శ్లోకాలను గురజాడ ఆంధ్రీకరణ కూడా చేశారు. బంగారాన్ని
నాణ్యం చేయడానికి నాలుగు మార్గాలున్నాయి. అలాగే మనిషికి కూడా నాలుగు విధాలుగా
నాణ్యత కనిపెట్టవచ్చని అంటారు.
తే. నాల్గురీతుల కనకంబు నాడెమగును
వేటు, గీటుల తునియించి, వెచ్చజేసి,
నరుడు, నట్టుల నాల్గింట నాడెమగును,
కులము, శీలంబు, కర్మంబు, గుణము చేత” అని.
గురజాడ – ‘గురుజాడ’ : గురజాడ వారిది ‘గురుజాడ’ అని మనం చాలా గొప్పగా
చెప్పుకుంటుంటాం. కాని వారే, ‘బుుతశతకం’ రాస్తూ….
“ధృతి గురుజాడ లనరిగెడు
గతి పెద్దలు జూప జనితి గజపతి మెచ్చన్”
అని ఎంతో వినమ్రంగా, తనకంటే పూర్వ కవులను గురుజాడలననుసరించారని
చెప్పుకున్నారు.
అయితే, గురజాడ పద్యాలు ఎంత బాగున్నాయని అనుకున్నా, అలా పద్యాలు
రాసుకుంటూ ఉంటే, గురజాడ వారిది గురుజాడ అయి ఉండేది కాదని, ఇంతమంది ఇన్ని
విధాలుగా వారి అడుగుజాడల్లో నడిచేది ఉండదని మనం నిర్ద్వంద్వంగా చెప్పుకోవచ్చు.