– ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ, ప్రధాన సంపాదకులు
కరోనా ప్రపంచాన్ని శాసించడం మొదలయి సుమారు ఒకటిన్నర నంవత్సరాలు అవుతోంది. సద్దుమణిగింది, మహమ్మారిని జయించాం అని ఊపిరి పీల్చుకునే లోపే భారత దేశంలో రెండవ తరంగం మరింత ఉధృతంగా వచ్చి పడింది. దానికి తోడు నిరంతరం మారుతూ ఒకరి నుంచి ఇంకొకరికి వేగంగా, సులువుగా సోకగల కరోనా రూపాలు విస్తృతంగా విస్తరించాయి. కరోనా వ్యాప్తి, నియంత్రణ అన్న అంశం ఒక Case Study గా పరిశోధించ తగ్గ అంశం.
అగ్రరాజ్యంలో ట్రంప్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా ఉనికినే నమ్మక, వ్యాధి నిరోధక పద్ధతులని పాటించనవనరం లేదనే ప్రచారం జరిగింది. దాంతో కరోనా వ్యాధి దేశమంతటా వ్యాపించి, ఎంతో మందికి సోకడంతో పాటు కొన్ని వేలమంది ప్రాణాలు తీసింది. ప్రభుత్వం మారడంతో, కరోనాని కట్టడి చేయడం, నయం చేయడం అన్న అంశాల మీద ప్రభుత్వ దృకృథం మారడంతో దేశంలో పరిస్థితి మారింది. కరోనా టీకాలు అందుబాటులోకి రావడంతో పరిస్థితి ఆశాజనకంగా మారింది. కానీ శాస్త్రీయ దృక్పథం లేని వారూ, వెజ్ఞానిక ఆవిష్కరణలని నమ్మని ప్రజలు దేశంలో 40 శాతానికి పైబడి ఉండడంతో కరోనా కట్టడి, నిర్మూలన అంత సులువు కాదు. ఇక్కడే కొత్త నాయకుడి ప్రతిభ కనపడింది. ప్రజలకి నమ్మకం కలిగేలా మాట్లాడడం, చెప్పిన మాటలు నీటి మూటలు కావని చేతల ద్వారా నిరూపించడం, బాధితుల పట్ల సానుభూతి పూర్వక ధోరణి అవలంభించడం లాంటి మౌలిక నాయకత్వ లక్షణాలున్న దేశాధినేత పరిస్థితిని సానుకూలంగా మార్చే దిశలో అడుగులు వేసాడు. విపక్షాల సహకారాన్ని భేషజం లేకుండా అభ్యర్థించాడు. టీకా కొనుగోలు వితరణ వ్యవస్థని కేంద్రీకృతం చేసి రాష్ట్రాలకి భారం లేకుండా చేశాడు.
భారత దేశంలో రెండవ తరంగం దేశ ప్రజల జీవితాలని ప్రగాఢంగా ప్రభావితం చేస్తోంది. ఆక్సిజన్ కొరత, అర కొర టీకా అందుబాటు మరియు సరఫరా కరోనా నివారణకి అవరోధంగా ఉన్నాయి. వంద కోట్ల జనాభాకి అవసరమయిన టీకా సేకరణ ఏర్పాట్లు జరిగినట్లు లేదు. పైపెచ్చు ఉన్న వాటిని దానం కూడా చేశారు. టీకా కొనుగోలు, వినియోగ బాధ్యత వంటి భారం రాష్ట్రాలపై నెట్టడంతో మరింత గందరగోళం నెలకొంది. టీకాల సంగతి ఇలా ఉంటే, వ్యాధిగ్రస్తుల చికిత్సకి కనీస అవసరమైన ఆక్సిజన్ కొరతతో ఎంతోమంది నిష్కారణంగా చనిపోతున్నారు. చనిపోయిన వారి అంత్యక్రియలకి కూడా సామాన్య ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. చేసేదేమీ లేకనో, ఏదో నమ్మకంతోనో మృతదేహాలని నదులలోకి తోసేస్తోంటే, కలుషిత జలం వేరే సమస్యలు తెచ్చే ముప్పు ఉంది. కట్టడి, నివారణకి ఒక సమగ్ర విధానం లేకపోవడంతో సమస్య మరింత జటిలంగా మారుతోంది. లక్షలాది జనంతో ఎన్నికల సభలు, కుంభమేళాలు నిర్వహించడం పాలకుల బాధ్యతారాహిత్యాన్ని, నాయకత్వ దివాలాతనాన్ని తెలియచేస్తున్నాయి.
కరోనాతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ పక్షుల్లా రాలిపోతూంటే సందట్లో సడేమియా అన్నట్లు కులాల కుంపటి, రాజకీయ రచ్చలు తెలుగు రాష్ట్రాలలో కరోనాని మించి కలకలం లేపుతున్నాయి. అనలు సమస్య నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు పాలకులు చేస్తున్న ప్రహసనం అయినా కాకున్నా ఇది హేయమైన, గర్హించదగ్గ విషయం. సాంత్వననిచ్చే సానుభూతి మాటలు మాట్లాడే సంస్కారం కూడా లేని పాలకులు రాష్ట్రాలలోనూ, కేంద్రంలోనూ ఉండడం దురదృష్టకరం. దేశం ఎదుర్కుంటున్న విపత్కర పరిస్థితులలో అన్ని పక్షాల వారినీ కలుపుకుని సమస్య పరిష్కారానికి సమష్టి కృషి చేయడం మాని ఒంటెత్తు పోకడలు, హేయమైన భేషజాలతో కాలం గడిపే పాలకులు కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ ఉండడం దేశానికి పట్టిన కరోనాని మించిన జాడ్యం. విపక్షాలను శత్రువులుగా చూస్తూ అవహేళన చేసే విష సంస్కృతి కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ మారితే తప్ప సంఘటితంగా కరోనాతో పోరాటం జరపడం అసాధ్యం. ముఖ్యంగా, మితిమీరిన వ్యక్తి ఆరాధన జాతి పురోగతికి గొడ్డలిపెట్టు. ఆసక్తికరమైన విషయమేమంటే, అగ్రరాజ్యంలో కూడా సంప్రదాయవాద రాజకీయ పక్షం వ్యక్తి పూజకి అలవాటు పడడంతో దేశ సమగ్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం తలెత్తుతోంది.
కరోనా సోకిన, కరోనాతో మరణించిన వారు మనలో చాలా మందికి తెలుసు. ఈ ప్రాపంచిక విపత్తు మనుషులలో మంచిని, మానవతని పెంచి, స్వంత లాభం కొంత మాని విస్తృత సమాజ శ్రేయస్సుకి పాటుపడేలా ప్రేరణ కలిగిస్తుందని ఆశిద్దాం.
క్లిష్ట పరిస్థితులలో చూపించ వలసిన నాయకత్వ లక్షణాలు పి. వి. నరసింహారావు గారి జీవితంనుంచి ఎన్నోనేర్చుకోవచ్చు. అదే భారత పాలకులు ఆయనకి ఇవ్వదగ్గ నిజమైన నివాళి.