సాంకేతిక ప్రకాశిక
గురజాడ…
కథా నిర్మాణంలో సైన్స్ పార్శ్వం
-తొలి సంచిక
ఏయే భాగాలలో అనంగీకారమో, ఒక భోగం
పడుచును, మైక్రోస్కోపు ముందు వుంచి ఎనలైజ్ చేసి చూస్తే తప్ప అమీతుమీ తేల్చుకోరాదు. ప్రయోగం, పరిశోధన, రుజువు సాధ్యపడనిదే ఏదీ సిద్ధాంతంగా చెప్పకూడదు…” ఇది గురజాడ అప్పారావు ఆంగ్ల కథానిక ‘స్టూపింగ్ టు రైజ్’లో అన్నమాట.‘సంస్కర్త హృదయం’ కథ యిదే! చాలా సరళమైన అంశాన్ని చాలా చమత్కారంగానే చెప్పడం కాదు. విజ్ఞాన విషయాల సైద్ధాంతిక భూమికకు సంబంధించిన మౌలిక అంశాలను యిట్టే పేర్కొన్నారు. జటిలమైన విషయాలను జటిలంగానే చెప్పవలసిన పనిలేదు – అనే విషయం కూడా సుతారంగా చెప్పాడు గురజాడ. ఎటొచ్చి మనం గుర్తించాలి!
గురజాడ ఐదే ఐదు – కాదంటే నాలుగున్నర – కథలు మాత్రమే రాశాడు. కానీ కథకుడిగా ఆయన వ్యూహం సమగ్రమైందీ, పరిపుష్టమైందీ – అనిపిస్తుంది.
కథావస్తువుపూర్తిగా బాధితుల పక్షం. దిద్దుబాటు (కమలిని),
మెటిల్డా, సంస్కర్త హృదయం – కథలు స్త్రీ సమస్యలకు సంబంధించి, స్త్రీ పక్షం వహించేవి. ఇపుడు స్త్రీ చైతన్యవాదమని వినబడుతుంది కానీ – ఆయన రెండు కథలకు కథానాయికల పేర్లు పెట్టడం గమనార్హం. మీ పేరేమిటి? పెద్ద మసీదు –
కథలు మత సంబంధమైన అంశాలను
స్పృశించినవి. మొత్తం కథలు అధిక
సంఖ్యాకులను బలంగా ఖండిస్తూ వ్రాసినవే!
ఈ విషయంలో రచయిత ధైర్యం గురించి
చెప్పుకోవాలి. దూరంగా వున్నవారిని అందరూ
విమర్శించగలరు. కానీ చాలా దగ్గరగా, బలంగా
వున్న శత్రువులను ఖండించడం – హాస్యంగా,
వ్యంగ్యంగా ఎత్తి పొడవడం చిన్న విషయం కాదు.
అవసరం బట్టి ఆయుధం ఎన్నుకున్నట్టు, సందర్భం బట్టి తగిన ప్రక్రియలలో తాను
చెప్పాలనుకున్న విషయాలు కళాత్మకంగా చెప్పడం ఆయన గొప్పతనం. ఇందులోని
అంతస్సూత్రాన్ని గుర్తించకుండా ప్రక్రియాపరమైన రాగద్వేషాలు పెంచుకోవడం తర్వాతి
తర్వాతి తరాల్లో కనబడటం విచిత్రం.
కథారచనకు సంబంధించి నిడివి గురించి కూడా మనం ఆలోచించాలి. ఈ ఐదు కథలు
5 పేజీలు, 15, 6, 3, 21 – ఉండటం ఆసక్తి కల్గిస్తుంది. కథ ప్రయోజనం బట్టి రచయిత
నిడివిని నిర్ణయించుకోవాలి మరి! దిద్దుబాటు, మెటిల్డా, పెద్ద మసీదు కథలు యిపుడు
మనం చదివే కథల నిడివిలో వున్నాయి. ఇవి దాదాపు 11 దశాబ్దాల క్రితం రాశాడని
గుర్తుంచుకోవాలి. మనం శతాబ్దం వెనుక వున్నామా లేదా గురజాడ శతాబ్దం ముందు
వున్నారా – అని అనిపించక మానదు. యాభై పేజీల్లో ఐదు కథలు యివ్వడం రచయిత
విజయమే!
అవసరం అయితే లేదా మరింత సార్వత్రికమనిపిస్తే కథని మార్చుకోవడంలో
తప్పులేదు. విజ్ఞానశాస్త్రం చెప్పే అంశం కూడా యిదే! కొత్త పరిజ్ఞానం తోడయినపుడు
ప్రయోగాత్మకంగా రుజువు అయినపుడు మార్చుకోవడం శాస్త్రీయ పద్ధతి. ‘కన్యాశుల్కం’
మాత్రమే కాదు ‘దిద్దుబాటు’ కూడా మార్పుకు లోనైంది. భాషాపరమైన సార్వత్రికతకు
ద్వారాలు తీసింది. ‘దిద్దుబాటు’ కు ముందే రచయిత కన్యాశుల్కం ద్వారా మార్పు
ప్రయోజనం గమనించారు. ఇది ఆయన శాస్త్రదృష్; టి వీరేశలింగం పంతులు సంస్కరణ
అభిలాష వున్నా – చెప్పేటపుడు వళ్ళు తెలియకుండా వాదించకపోవడం గురజాడ
గొప్పదనం. గురజాడను చిరంజీవిని చేసింది. అదే. ఆయన శిల్ప వైశిష్ట్యం, హాస్యం,
వ్యంగ్యం, వెటకారం రంగరించి చెప్పడంతో గుర్తుండటమే కాదు, దెబ్బ గట్టిగా
తగులుతుంది. మొరటుగా చెప్పకుండా సుతారంగా సూచించడం ఎక్కువ
ప్రభావవంతమైంది. ఆసక్తిగా నడపడం ఎంత ముఖ్యమో, అంతే స్థాయిలో ప్రారంభం,
ముగింపులు వుండటం తెలివైన వ్యూహం. ‘దిద్దుబాటు’ కథానిక – ‘తలుపు తలుపు’
అంటూ మొదలవుతుంది. “తలుపు తెరవబడలేదు. ఒక నిమిషమతడూరుకొనెను. గదిలోని
గడియారము టింగుమని ఒంటిగంట కొట్టినది” – అని కథ సాగుతుంది. ఆసక్తిని
కొనసాగించడమే కాక, సమయాన్నిసూచిస్తారు. తర్వాత అతని మనోగతంలోకి వెళతాడు.
తర్వాత దీపం కూడా లేదని సూచిస్తూ కథ నడుపుతాడు – కథానాయిక కమలిని ఉత్తరం
లభిస్తుంది. అప్పటికి గొప్ప విషయమే! అంతేకాదు ‘ఆడారు చదువు నేరిస్తే ఏటౌతాది?’
అని పాత్రోచితంగా ఆ ప్రాంతపు భాషను ప్రవేశపెట్టాడు.
ముగింపు కూడా కథకి అంతే ముఖ్యం. చదువరి మీద ప్రభావం కల్గించే విషయంలో
ముగింపు చాలా ముఖ్యమైంది. “ఆయన కళ్ళు నీళ్ళతో గిర్రున తిరిగాయి” – అని ‘సంస్కర్త
హృదయం’ ముగిస్తే – “అంతలో మంచం కింది నుంచి అమృతం వొలికే కలకల నవ్వు,
మనోహరైన నూపురముల రొద విననయ్యెను” – అని ‘దిద్దుబాటు’ ముగుస్తుంది. మిగత
మూడు కథలు సంభాషణతో ముగియడం విశేషం. మరీ ముఖ్యంగా ‘పెద్ద మసీదు’
(మతము : విమతము) అయితే “అయ్యో! నువ్వా! మావా!” అని ముగియడం అద్భుతమైన
కొసమెరుపు. ఈ మూడు పదాల జవాబు మొత్తం కథలోని కథను ఎరుకపరుస్తుంది. ఈ కథ
అర్ధాంతరంగా ఆగిపోయిందని అంటారు. ఒక్క నార్ల మాత్రమే యిది సంపూర్తి అయిన కథ
అన్నారు.
కథ నడపటం కూడా సందర్భం బట్టి మారడం గమనార్హం. మీ పేరేమిటి, సంస్కర్త
హృదయం – వర్ణనాత్మకం కాగా, దిద్దుబాటు, పెద్ద మసీదు, మెటిల్డా – సంభాషణాత్మకంగా
సాగుతాయి!! “నా కళ్ళకు కట్టినట్టు ఆ వొంచిన మొఖం, బిందువులుగా స్రవించిన కన్నీరు,
ఆచుకొన్న నిట్టూర్పుల చేత కంపించిన రొమ్ము”- ఏ మహాకవి రచనలోనూ లేదనగలను.
“అగాధమైన కరుణ రసం, ఆ సరిలేని సొగసున్ను… ” – యిలా మెటిల్దా గురించి వర్ణన.
అలాగే మరోచోట “మీ పేరేమిటి”లో క్రీస్తును, శ్రీమహావిష్ణు యొక్క పదకొండవ
అవతారంగా చెయ్యడానికి సాధ్యం కాక వొడబడి వూరుకున్నాం… ” అంటారు రచయిత.
పైన ఎంత భావుకత వుందో యిక్కడ అంత వ్యంగ్యంవుంది. అలాగే ‘సంస్కర్త హృదయం’లో
సమాజంలో భోగం పడుచులు “సేఫ్టీ వాల్వ్ స్” వంటివారు. అనడంలో చమత్కారంతో
నాణేనికి రెండోవైపు వంటి దృష్టి కూడా వుంది. “లేబరేటరీలో దుర్వాసన కొట్టే సల్ఫ్యూరిక్
యాసిడ్, హైడ్రోజన్ కంటే అగరు, అత్తరుల వాసనలు సరికొత్త మార్పులని
అంగీకరించాడు…” అని ‘సంస్కర్త హృదయం’లో అనడం హాస్య చతురతే!
అంతకు మించి “దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా? మీ
పేరేమిటి?” అనే కథ శీర్షికలో శాస్త్ర దృష్టి పుష్కలంగా వుంది. ఇంత సమగ్రమైన,
ప్రతిభావంతమైన వ్యూహం ఎలా సాధ్యపడింది – అనే ప్రశ్నకు జవాబు కావాలంటే ఆయన
ఆలోచన, పాండిత్యపు నేపథ్యం పరిశీలించాలి. ఆయన బి.ఎ.లో తత్వశాస్త్రం, సంస్కృతం
నేర్చుకున్నారు. గిడుగు రామమూర్తి పంతులు బాల్య స్నేహితుడే కాదు, బి.ఎ.దాకా కలసి
చదువుకున్నారు. మొదట ఇంగ్లీషులో కవిత్వ రచన. అలా తొలి దశలో రాసినవి
ప్రచురింపబడటమే కాదు, అభినందనలతో పునర్ముద్రింపబడ్డాయి పెద్ద పత్రికలలో!
మొదట హైస్కూలులో ఉపాధ్యాయుడు, తర్వాత డిప్యూటీ కలెక్టరాఫీసులో హెడ్ క్లర్క్,
తర్వాత లెక్చరర్ ఉద్యోగం, ఇంగ్లీషు వ్యాకరణం, సంస్కృత సారస్వతం, అనువాదం, గ్రీకు,
రోమన్ చరిత్రలు – ఆయన బోధించేవాడు. అదే సమయంలో సంస్థాన శాసన పరిశోధక
పదవి. తర్వాత సంపాదకుడు కావాలని ఆశతో ‘ప్రకాశిక’ సంపాదకునిగా డిక్లరేషన్
తీసుకున్నాడు. కావ్యాలు, చరిత్రలు పరిశోధించి, పరిష్కరించడం, గజపతుల దావాలు
నడపటం, రీవారాణి అంతరంగిక కార్యదర్శి ఉద్యోగం, మద్రాసు విశ్వవిద్యాలయంలో
ఫెల్లో పదవి. ఇదీ ఆయన నేపథ్యం.
గురజాడ కథలు ఒకటికి మూడుసార్లు చదివితే, మనం ఆయన బాణి పట్టుకుని
ముందుకెళ్ళింది స్వల్పమే – అనే అభిప్రాయం తప్పక కలుగుతుంది.