వనితా ప్రకాశిక ప్రశ్నావళి
నిర్వహణ: డా. సి. భవానీదేవి
– తొలి సంచిక
రాజకీయాలలో మహిళలు పదవులు నిర్వహిస్తున్నారు. కానీ నిజమైన అధికారం…
పురుషులే చెలాయిస్తున్నారు? ఈ ధోరణిలో మార్పు తీసుకురావటానికి మహిళల కర్తవ్యం
ఏమిటి? (నాగలక్ష్మి, గుడివాడ)
జవాబు : ఈ పరిస్థితి ఉన్నది. దీనికి కారణం పితృస్వామ్య వ్యవస్థే. స్త్రీని ఎన్నికల్లో నిలబెట్టి,
గెలిపించి, అధికారం పురుషులే చెలాయించటానికి కారణం స్త్రీలే. వాళ్ళు తమ శక్తియుక్తుల్ని
అంచనా వేసుకుని, సాధికారతతోనే ఏ రంగంలోనైనా అడుగుపెట్టాలి. తన జీవన సూత్రాన్ని
మరొకరి చేతిలో ఉంచటం అవమానకరమైన బానిసత్వం. దీనిని గ్రహించి మెలకువతో
వ్యవహరించాలి.
ఈ రోజుల్లో కూడా భర్త మరణించాక పూలు, బొట్టు, గాజులు వంటివి తీయడం ఎంతవరకు
సమంజసం? (ప్రమీల, విజయవాడ)
జవాబు : సంప్రదాయం వికృతమైన వ్యవస్థలో స్త్రీలను అణచివేసి వంటింటికి పరిమితం
చేసిన దురాచారం ఇది. మెల్లగా స్త్రీలు తెలుసుకుంటారు. పూలు, బొట్టు, గాజులు స్త్రీ అభిరుచి,
హక్కులు. వాటికీ భర్తకీ ఎటువంటి సంబంధం లేదు.
మహిళలకు ఏ విధమైన వికాసాన్ని కలిగించకపోగా వారిని ఎదగనీయని టి.వి సీరియల్స్ ని
నిత్యం చూస్తూ వారి రేటింగ్ పెంచుకుంటూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. స్త్రీలకు అవేర్నెస్
కలిగించటం ఎలా? తోటి స్త్రీలుగా మనం ఏం చేయగలం? (గౌరీలక్ష్మీ, హైదరాబాదు)
జవాబు : స్త్రీలను కుట్రదారులుగా విలన్లుగా చిత్రీకరించే సీరియల్స్ లో స్త్రీలు నటిస్తున్నారు.
డైలాగులు రాస్తున్నారు. డ్రగ్స్ లాంటి ఈ సీరియల్స్ ని ఎక్కువగా చూస్తున్నది స్త్రీలే! కాబట్టి
ఆలోచనాత్మకంగా వ్యవహరించి ప్రతిఘటించాలి. ఇలాంటి పాత్రల్లో నటించటం, డైలాగ్స్
విషపూరితంగా రాయటం మానేయాలి. చూడటం మానేయాలి. మార్పు ఒక్కరాత్రిలో రాదు.
క్రమంగా వస్తుంది.
ఎమోషనల్ సపోర్టు, షేరింగ్ కోసం మంచి స్నేహితుల్ని ఏర్పరచుకోవాలి అంటే తరచూ
టీమ్ మెంబర్స్ మారిపోయే మా సాఫ్ట్ వేర్ బిజీ ఎంప్లాయిస్కి సాధ్యం కాదు. మేమేం చేయాలి?
(కాంతిరేఖ, చెన్నై)
జవాబు : ముందు స్నేహం అనే పదానికి అర్థం తెలియాలి. సపోర్టు, షేరింగులకు మించిన
మానసికబంధం. ఇది కుల, మత, ఆర్థిక వ్యత్యాసాలకు అతీతమైనది. కొలీగ్స్ అంతా స్నేహితులు
కాలేరు. ఎంతదూరం ఉన్నా ఒకరినొకరు స్నేహించుకునే అవ్యాజ మమకారం ఉన్న స్నేహితులు
దొరకటం ఆధునిక కాలంలో అరుదైన విషయం. మనమే రంగంలో ఉన్నాం అనేదానికన్నా
మానసిక సారూప్యతే స్నేహానికి మూలం. అనుకోకుండా ఏర్పడే బంధం అది.