సుమతి శతకం లోని
అడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుటకంటెన్
వడిగలయెద్దుల గట్టుక
మడిదున్నుక బ్రతకవచ్చు మహిలో సుమతీ!
అనే పద్యంలో ఆ కాలంలోనే ఆత్మాభిమానాన్ని చంపుకుని ప్రభుత్వ ఉద్యోగాలకు
ఎగబడవద్దనే సందేశము, పోతన జీవితాన్ని గుర్తుచేస్తూ వ్యవసాయంలో ఉన్న ఆత్మగౌరవ
నినాదమూ ప్రబోధిస్తూ ఈ నాటికీ ఏనాటికీ, వ్యక్తిత్వ వికాసానికి పనికివచ్చే అమూల్య
సందేశం ఇమిడిఉండడం మనను పులకింపచేస్తుంది.
ఎట్టుగ బాటుబడ్డ నొకయించుక ప్రాప్తములేక వస్తువుల్
బట్టు బడంగ నేరవు నిబద్ధిసురావళి గూడి రాక్షసుల్
గట్టు బెకల్చిపాల్కడలికవ్వముచే మథియించిరెంతయున్
వెట్టియకాక యేమనుభవించిరి వారమృతంబు భాస్కరా!
అనే భాస్కరశతక పద్యం ఎంత కష్టపడ్డా ప్రాప్తానికి ఒకింత దైవం అనుకూలించాలి
అంటూనే దైవబలం ఉన్నాముందు మనం బాగా కష్టపడాలి అనే గొప్ప ప్రబోధం చేస్తుంది.
దీన్ని గురించి ఎంతైనా విస్తరించుకోవచ్చు. ఇవే శతకాలు సాహిత్యం ద్వారా సమాజానికి
చేసిన సేవ.
ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విస్తారం అయిపోతుంది. కేవలం తెలుగు శతక
సాహిత్య రేఖామాత్ర పరిచయమే వ్యాస లక్ష్యం. తెలుగు శతకాల్లోని పద్యాలు తెలుగు భాషా
సౌందర్యాన్ని ఇనుమడింపచేసాయి. కవిత్వాన్నీ పండించాయి. తెలుగువారి అభ్యుదయాన్ని
కాంక్షించాయి. అజరామరమైన సందేశాలను ప్రబోధించి మానవజీవితాన్ని
సక్రమమార్గంలో పెట్టేందుకు అనన్య కృషి చేసాయి.
ఆ శతక కర్తలైన మహనీయులందరిని సంస్మరించుకుందాం. తెలుగు శతక సాహిత్య
వైభవాన్ని కాపాడుకుందాం.