పద్య ప్రకాశిక
శతక సౌరభం
– తొలి సంచిక
ఆధునిక తెలుగు సాహిత్యంలో మహాకవి గా పేరుపొందిన
ఉద్దండ కవి గురజాడ అప్పారావు గారు. వారి సాహిత్యం, అది ఏ ప్రక్రియ అయినా, సమాజ చైతన్యం కోసమే సాగింది. పేరు ప్రతిష్టలకోసం కాక తమ కాలంనాటి సమాజ రుగ్మతలకు ఒక సాహిత్య ఔషధాన్ని తమ కలం ద్వారా తయారుచేసి అందించాలన్న తపననుండి ఆవిర్భవించినవి గురజాడ రచనలు. నాటి చరిత్రను కళ్ళముందు కట్టడమే కాక నేటికీ కొన్ని రచనల సందేశం అన్వయిస్తూనే ఉంది. అదే నిజకవిత్వానికి గీటురాయి. కవి తన సాహిత్యం ద్వారా మాత్రమే శాశ్వతత్వాన్ని పొందుతాడు. తెలుగు సాహిత్యాన్ని అభ్యుదయ దృక్పథoతో అధ్యయనం చేస్తే గురజాడకు ముందూ గురజాడకు తరువాత అన్నట్లుగా కొత్తపాతల మేలుకలయికగా నిలచిన సామాజిక కవి గురజాడ. వారు పూర్వం ప్రారంభించి వదిలిన ప్రకాశిక పత్రికను ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ గారు పునరుద్ధరించి గురజాడ ఆశయాలకు అనుగుణంగా నడుపుదామని పూనుకోవడం బహుధా ప్రశంసనీయం. వారి ఆశయాలకు అనుగుణంగా ఉత్తమ అభిరుచులతో ఉన్నత లక్ష్యాలతో పత్రిక నడవాలని ఆకాంక్షిస్తున్నాను.
జానపద సాహిత్యంతో సాధారణంగా ఏ భాషాసాహిత్యమైనా ఆరంభం అవుతుంది.
సాహిత్యం క్రమవికాసం పొందుతున్న కొద్దీ ఎన్నో మార్పుచేర్పులకు లోను
అవుతూఉంటుంది. శిష్టప్రామాణిక కవిత్వం మన తెలుగులో అందుబాటులోకి వచ్చి
పదకొండు వందల సంవత్సరాలు మాత్రమే. ఆదికవి నన్నయ నుండీ క్రమవికాసశీలిగా
తెలుగు సాహిత్యం మరే ఇతర భాషలూ సంతరించుకోలేనన్ని ప్రక్రియారూపాలను తన
సొంతం చేసుకుంది. ఆ క్రమం లోనే తెలుగు సాహిత్య మకుటంలో ఒక వజ్రంలాగా శతక
సాహిత్యం ప్రకాశిస్తూ ఉన్నది. భాషాసాహిత్య సంపదను ఎంతగానో పెంచిపోషించి
పరిపుష్టం చేసింది.
శతకం అంటే వంద పద్యాలతో ఉన్నది అని. సాధారణంగా కవులు సంప్రదాయంగా
108 లేదా 101 వ్రాస్తూ ఉంటారు. సున్న చివర ఉంటే మనవారికి నచ్చదు. చరిత్రకు
అందినంతవరకు తెలుగులో మొదటి శతకం శివకవియుగం నాటి మల్లికార్జున
పణ్డితారాధ్యుని శివతత్త్వసారం. ఇందులో 489 పద్యాలు. మనం ఇదమిత్థoగా చెప్పుకునే
శతక లక్షణాలకు కొంత భిన్నమైన పోకడలతో ఉన్నది. అదే మొదటి శతకం అనుకుంటే
తరువాత తరువాత తెలుగులో శతక సాహిత్యం విస్తారంగా వెలువడింది.
ప్రతిశతకానికి ఒక మకుటం ఉంటుంది. ప్రతిపద్యం దేనికదే ఒక స్వతంత్ర భావాన్ని