డా. NCh.చక్రవర్తిి
తరతరాల తెలుగు పద్యం సుగంధాలను మనంం ఆస్వాాదిస్తుున్నాం. తెలుగు పద్యం భాషకి మకుటాయమానమై వెలుగుతూ మాట ఉన్నంత వరకూ మనుతుంంది అనడంలో సందేహం లేదు.
మనుచరిత్రలో ఒక పద్యం:
ఉత్పల.
యౌవనమందు యజ్వయు ధనాఢ్యుడునై కమనీయ కౌతుక
శ్రీ విధి గూకటుల్ గొలిచి చేసిన కూరిమి సోమిదమ్మ సౌ
ఖ్యావహయై భజింప, సుఖులై తలిదండ్రులు గూడి దేవియున్
దేవరవోలె నుండి యిలు దీర్చగ గాపురమొప్పు వానికిన్(1)
కుటుంబం ఎలా ఉండాలో ఎలా ఉండేదో పెద్దన తన మనుచరిత్రలో వర్ణించాడు. ప్రవరుని కుటుంబం. అతడు యజ్ఞం చేసినవాడు. ధనాఢ్యుడు. కమనీయమైన ఈడూ జోడు యవ్వన సంపదను చూసి ప్రేమతో కూడిన సోమిదమ్మ (భార్య). ఆమె సౌఖ్యాన్ని కలిగిస్తూ సేవిస్తూ ఉండగా అతడి తల్లిదండ్రులు సుఖంగా దేవియున్ దేవర వోలె అంటే పార్వతీ పరమేశ్వరులలాగా ఇంటిని చక్కదిద్దుతూ ఉండగా కాపురం చక్కగా సాగుతున్నది అని.
ఇక్కడ కూకటుల్ కొలిచి చేసిన కూరిమి స్తోమిదమ్మ అంటే అర్థం మొదళ్ళు మూలాలూ చూసి చేసినది అని. ఏమిటి ఈ మూలాల అంటే అది భారతీయ వెవాహిక వ్యవస్థలోని ఒక మర్మం. ఏడు తరాలు అటూ ఇటూ చూడాలి అంటారు పెద్దలు. అలాగ ఆమె వంశమూలాలు చూసి చేసారు అని. ఇది ఇతర సంస్కృతులలో లేనిది. మన సంంస్కృతీ వైభవాన్ని చాటేది. అందుకే ఆ కాలంలో వివాహాలు సమాజపటిష్టటతకు మూలకంబాలుగా ఉండేవి. కుటుంబాన్ని ఉద్ధరిస్తూ ఆదర్శ సమాజ నిర్మా ణాన్ని చేసేవి. ఈ కాలంతో పోలిక లేదు. ఈ ఒక్క పద్యంలో చెప్పుుకోదగిన విశేషాలను ఎన్నో ధ్వనింపచేసాడు పెద్దన. అది ఒక కవితానిర్మాణ చాతుర్యం.
“కవిసమ్రాట్” విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షంలో ఒక ఆణిముత్యాాన్ని చూద్దాం.
సీ.
ప్రభుమేనిపై గాలి పై వచ్చినంతనే
పాషాణ మొకటికి స్పర్శవచ్చె,
ప్రభు కాలిసవ్వడి ప్రాంతమైనంతనే
శిలకొక్కదానికి చెవులు కలిగె,
ప్రభు మేని నెత్తావి పరిమళించిన తోన
యశ్మంబు ఘ్రాణేంద్రియంబు జెందె,
ప్రభు నీలరత్న తోరణ మంజులాంగంబు
కనవచ్చి రాతికి కనులు కలిగె,
గీ.
ఆ ప్రభుండు వచ్చి యాతిథ్యమును స్వీక
రించునంత నుపలహృదయవీథి
నుపనిషద్వితానమొలికి శ్రీరామభ
‘ద్రాభిరామమూర్తి యగుట దోచె.(2)
శ్రీరాముడు గౌతముని ఆశ్రమాన్ని చేరుకుంటున్నాడు. అహల్యకు రూపం వచ్చే సందర్శం. రాముని ఒంటి పైనుండి వచ్చే గాలి సోకగానే రాయికి స్పర్శ వచ్చింది. (పాషాణము అంటే శిల) రాముని పాదాల అలికిడి ఆ ప్రాంతం రాగానే శిలకు చెవులు వచ్చాయి.. రాముని ఒంటి పరిమళం తాకగానే అశ్మానికి అంటే శిలకు వాసన వచ్చింది. రాముని నీలరత్నపు రంగుకు చూడడానికా అన్నట్టు ఆ రాతికి కనులు చ్చాయి.రాముడు వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ఆతడు సర్వ ఉపనిషత్తుల సమూహ సారం. ఇందులో అద్భుత భావన. సాక్షాత్తూ నారాయణ స్వరూపుడు కనుక సమస్త ఉపనిషత్తుల సారం అతడు అని ధ్వని. శిలగా పడిఉన్న అహల్యకు ఒక్కొక్కటిగా పంచేంద్రియాలు పనిచేసాయి. పంచభూతాత్మమకం ఈ తనువు. శబ్ద స్పర్శ రూప రస గంధాదులు పంచేంద్రియాలకు సంబంధించినవి. అంటే పంచభూతాలకు అధిపతి దైవస్వవ రూపుడు అయిన శ్రీరామచంద్రుడు అని చెప్పడం. ఆ క్రమంలో మొత్తంగా అహల్య తన రూపాన్ని తిరిగి ధరించింది.అహల్యా శాప విమోచనం అనే సామాన్య విషయంతో పాటు శ్రీరాముని దైవత్వం విశేషంగా చెప్పడం ఇందులో ప్రధానం. ఈ క్రమంలో ఆ ఘట్టాన్ని వర్ణణ చెయ్యడం అద్భుత కల్పన.
శతకపద్యాలలోకి వస్తే మారదవెంకయ్య రచించిన భాస్కర శతకంలోని ఒకపద్యాన్ని అవలోకిద్దాం.
ఉత్పల.
దక్షుడులేని యింటికి పదార్థము వేరొకచోటనుండి వే
లక్షలు వచ్చుచుండిన బలాయనమైచను గల్లగాదు ప్ర
త్యక్షము వాగులున్ వరదలన్నియు వచ్చిన సరు నిల్చునే
యక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా! (3)
కుటుంబానికి సమర్థుడైన యజమాని లేకపోతే ఎక్కడెక్కడి నుండి లక్షలు లక్షలు వచ్చినా అదీ వ్యర్థం అయిపోతుంది. ఆ సొత్తు ఇంట్లో నిలువదు. చెల్లాచెదురైపోతుంది. ఇది మనం ప్రత్యక్షంగా చూస్తున్నదే. గట్టుతెగిన చెరువులోకి వరదలై వెల్లువై నీరు వచ్చినా ఆ నీరు నిలువదు కదా! పై పెచ్చు వ్యర్థంగా పోతుంది కదా!
ప్రకృతి సిద్ధంగా జరిగే విషయాన్ని మన జీవితానికి అన్వయించి చెప్పడం మన శతకకవుల నైపుణ్యం. అద్భుత పరిశీలన. కవిత్వ దక్షత. ఇలాంటివి వేలుగా మన సాహిత్యంలో ఉన్నాయి.
ఈ మారు మనం ఎంచుకునే తేలిక పద్యాలలో ఆధునిక శతకం అయిన శతకవనం నుండి ఒక పద్యాన్ని చూద్దాం.
తేగీ.
ఎంచి కులమును విద్య బోధించుటెల్ల
బ్రకృతి తత్త్యములకు నతిక్రమణ మగును
నదికి, చెట్టుకు లేదిట్టి నాసిబుద్ది
యెదను గదలించు మాటజెప్పెను వినుము (4)
రంగు, రుచి, వాసన చూసి ప్రకృతి సేవ చెయ్యదు. నరుడు కులాన్ని చూసి విద్య ను బోధించడం అన్న ది ప్రకృతికి విరుద్ధమైన స్వభావం. అది ప్రకృతిని అతిక్రమించడం. రాజుకు, బంటుకు చెట్టు గాలిని అందిస్తుంది. ధనికి, పేదకు నది ఒకేలాగా నీరు అందిస్తుంది. వీటిని చూసి మనం నేర్చుకోవాలి. మానవీయగుణం వికసించాలి అని కవి ప్రబోధం.
మరిన్ని విషయాలను మరల తెలుసుకుందాం.
సూచికలు:
- పెద్దన మనుచరిత్రలో ప్రథమాశ్వాసము – పద్యం 53.
- కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి శ్రీమద్రామాయణ కల్పవృక్షం లో అహల్యా శాపవిమోచన ఘట్టం.
- మారదవెంకయ్య రచన భాస్కరశతకం లో పద్యం 53. హిందూ ధర్మ ప్రచార సమితి తిరుమల వారి ప్రచురణ 2015.
- ఎన్. సిహెచ్. చక్రవర్తి రచన శతకవనంలో విరి 63. స్వీయ ప్రచురణ.