11.5 C
New York
Sunday, November 24, 2024

విద్యా దదాతి వినయం

డాక్టర్‌ కొవ్వలి గోపాలకృష్ణ,
ప్రధాన సంపాదకులు, ప్రకాశిక

వేసవికాలం వచ్చింది అంటే పిల్లలకి, తల్లిదండ్రులకి కూడా పరీక్షా సమయం. ఎంతో కష్టపడి చదివి ఎలా రాస్తామో అన్న ఆందోళన పిల్లలకి, వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తాయి, ఏ ర్యాంక్‌ వస్తుందో అన్నది తల్లిదండ్రుల ఆందోళన, వేసవి వల్ల వచ్చే ఉక్కబోత, వేడి కంటే పరీక్షలు, వాటి ఫలితాలు తెచ్చే తాపం ఎక్కువగా ఉంటుంది. సంవత్సరం అంతా కష్టపడి ఎన్నో ప్రశ్నలకి జవాబులు బట్టీ పట్టినా పరీక్షలో వచ్చే కొన్ని ప్రశ్నలకి జవాబులు తెలియక పోతే ఆశించిన ఫలితాలు రావు. భారతీయ విద్యావిధానంలో, ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాలలో ఉన్న విద్యావిధానంలో, పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలతో పాటు డిగ్రీ పరీక్షలు కూడా విద్యార్థి యొక్క మనన dశక్తి, మననం చేసిన విషయాన్ని పరీక్షలలో రాసే శక్తిని మాత్రమే పరీక్షిస్తున్నాయి. విద్యార్థులలో ఉండే సృజనాత్మకతని, సాంకేతిక అభిరుచిని ప్రోత్సహించే అవకాశాన్ని మన విద్యా విధానం కలిగించడం లేదు. కొన్ని సంస్లలు చేసిన పరిశోధన ప్రకారం భారత దేశంలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాలనుండి ఉత్తీర్ణులైన వారిలో సగంమందికి పైగా ఉద్యోగార్హత లేని వారు. అంటే, వేర్వేరు సంస్థలలో పనికి అవసరమయిన నైపుణ్యం వారికి లేదన్నమాట. గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థుల మధ్య ఉన్న అంతరం తో పాటు, సాధారణ చదువులు చదువుకున్నవారికి అవకాశాలు తక్కువ అన్న విషయం పరిశోధన చేయకుండానే చెప్పవచ్చు.

గత కొన్ని దశాబ్దాలుగా, విద్యార్థులు వారి మీద వారు పెట్టుకుంటున్న అంచనాలతో పాటు తల్లిదండ్రులు పెట్టుకుంటున్న అంచనాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా, వారు సాధించలేనివి వారి పిల్లలు సాధించాలనే ఆశ, వారి బంధుమిత్రుల పిల్లలతో పోలుస్తూ వారికంటే గొప్ప చదువులు చదివి, ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందాలన్న ఆకాంక్ష మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి తల్లిదండ్రులలో ఎక్కువగా చూస్తున్నాము. ఏ డిగ్రీలు సాధిస్తే తొందరగా పెద్ద పాకేజ్‌ తో ఉద్యోగం వస్తుంది, లేక విదేశాలలో ఉద్యోగం పౌందాలంటే ఏ చదువులు చదవాలి అన్న అంశాలమీద పిల్లల కంటే పెద్దలకే ఎక్కువ ఆసక్తి ఉండడం గమనిస్తాము. ఒకరి పిల్లలు ఇంజనీరింగ్‌ చదివితే, ఆ కాలనీలో ఉండే వారి పిల్లలలో ఎక్కువ మంది ఇంజనీరింగ్‌ చదువుకోసం ఆరాట పడే అవకాశాలు ఎక్కువ ఉండడం సాధారణంగా చూస్తాము. పిల్లల అభిరుచి గమనించి, అడిగి తగిన విద్యావకాశాలు కలిగించే తల్లిదండ్రులు కొంతమంది ఉండే ఉంటారు.

చదువు ఉద్యోగావకాశాలను కలిగించేదిగా ఉండాలన్నది సాధారణ ఆలోచన. అది తప్పుకాదు. కానీ ఇష్టం లేని చదువు చదివి, ఇష్టం లేని వృత్తి చేపట్టి జీవించడం అందరికీ సాధ్యం కాదు. భారతీయ యువకులు
పరిస్థితులను బట్టి తమను తాము మలచుకునే తత్త్వం గలవారు. అయినప్పటికీ అభిరుచికి భిన్నమైన పనిని జీవితాంతం చేయడం కష్టం కదా! పాశ్చాత్య దేశాలలో ఉన్నత పాఠశాల ముగిసే సమయంలో విద్యార్థులలో “వృత్తి అభిరుచి” (621661 ఇ్రుడ6(16) ఏమిటి అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రక్రియలో చాలామంది విద్యార్థులు తాము ఏ వృత్తిలో రాణించే అవకాశం ఉందో, ఏ వృత్తి తమ నైజానికి నప్పదో తెలుసుకునే అవకాశం లభిస్తుంది. అలాంటి ప్రక్రియ భారతదేశంలో కూడా అక్కడక్కడ ఉందేమో గానీ ప్రతీ కళాశాల విద్యార్థికీ అందుబాటులో ఉంటే బాగుంటుంది. ఆశ్చర్యకరంగా, అమెరికాలో, భారత ఉపఖండానికి చెందిన వారి పిల్లల మీద ఉండే వత్తిడి భారత దేశంలో ఉండే విద్యార్థుల మీద ఉండే వత్తిడి కంటే తక్కువ కాదు! పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్‌ లు, కనీసం శాస్త్రవేత్తలు కావాలని అమెరికాలో ఉంటున్న వారి తపన కనాలే గానీ చెప్పలేము!

“కాలేజీ చదువు అయ్యాక ఏమి చేద్దామనుకుంటున్నావు” అన్న ప్రశ్న దాదాపు విద్యార్థులు అందరూ ఎదుర్కునేదే. “నువ్వు ఎలాంటి మనిషిగా అవ్వాలనుకుంటున్నావు” అని మాత్రం ఎవరూ ఆడగరు. తాను చేపట్టిన ఉద్యోగం, వృత్తి మీద ఒక వ్యక్తి విలువ ఆధారపడి ఉండడం సమాజంలో సాధారణంగా చూస్తాము, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నత పదవులలో, ప్రభావశీలమైన పదవులలో ఉన్నవారితో స్నేహం, వియ్యం పొందాలని ఉవ్విళ్లూరతాము కానీ ఉన్నతంగా ఆలోచించే ఉత్తమ వ్యక్తుల సాంగత్యం కోసం తపించడం అరుదు కదా. అంతేకాదు, ఉన్నత విద్య, ఉద్యోగం ఉన్నా సామాజిక వర్గ ప్రాతిపదికన స్నేహం చేసేవారు ఇంకా ఎంతో మంది భారత సమాజంలో ఉన్నారన్నది నిర్వివాదాంశం.

“విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం | పాత్రత్వాత్‌ ధనమాప్వ్పోతి ధనాద్ధర్మం, తతః సుఖం” అని మిత్రలాభం లో చెప్పినట్టు, విద్య వలన వినయం అలవడాలి; వినయం వలన అర్హత కలుగుతుంది,
విద్యా వినయాల వలన ధనం ప్రాప్తిస్తుంది; ఆ ధనము ద్వారా ధర్మ నిరతితో కూడిన సుఖము పొందాలి. స్వయం పురోగతితో పాటు సమాజ అభివృద్ధికి పాటుబడే తత్వం ధర్మ నిరతిలో భాగం.

కలిసి పనిచేసే తత్వం గలవారిని అంతర్జాతీయ, జాతీయ సంస్థలు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ తత్వం చీన్నప్పటినుండే అలవడేలా తల్లిదండ్రులు, విద్యాలయాలు కృషిచేయాలి. పాఠ్య ప్రణాళికలో భాగంగా ఈ అంశం చేర్చాలి. సమస్యలు పరిష్కరించగలగడం, ఆలోచనలను ఆకర్షణీయంగా పంచుకోవడం, సంభాషణా చాతుర్యం లాంటి నైపుణ్యాలు చాలా అవసరం. స్వంత లాభంతో పాటు, పరాయివారికి చేయూతనిచ్చే కార్యక్రమం చేపట్టాలన్నది ప్రాచీన సాహిత్యంలో నుంచి గురజాడ పాట వరకూ చదువుకుంటున్న విషయమే. ఉన్నత ఆలోచనలు, ఆశయాలు సమాజంలో విస్తరింపచేయడానికి విద్య ఉపయోగపడాలి. ఈ సంవత్సరం ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ తమ అభిరుచికి అనుగుణంగా, తమ కలల సాకారం దిశగా అడుగులు వేస్తూ ఆనందమయ జీవితం సాగించాలని ఆకాంక్షిద్దాము.

Vote this article
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles